కోదండ‌రాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “

February 22, 2017 at 10:54 am

తెలంగాణ ఉద్య‌మంలో కీలకంగా వ్య‌వ‌హ‌రించి.. అన్ని వ‌ర్గాల‌ను స‌మైక్యం చేసిన టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంపై టీఆర్ఎస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. కోదండ‌రాం ఎదురుదాడితో ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డిపోయింది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆయ‌న `కులం` కార్డును తెర‌పైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమ‌న్.. కోదండ‌రాం రెడ్డి అని సంబోధించి స‌రికొత్త చర్చకు దారి తీశారు. ప్ర‌స్తుతం దీనిపై తెలంగాణ‌లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. దీని వెనుక పెద్ద క‌థే ఉంద‌ని స‌మాచారం. ఒక‌ప‌క్క తాము సేఫ్ సైడ్‌లోకి వెళ్లి.. కోదండ‌రాం ప్ర‌తిప‌క్షాలకు ముఖ్యంగా రెడ్డి సామాజిక‌వర్గం వ్య‌క్తి అని ఆయ‌న‌పై ముద్ర వేసేందుకు టీఆర్ఎస్ నేత‌లు వేసిన ప్లాన్ అని స‌మాచారం.

కోదండ‌రాంపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో కొంత విశ్వాసం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న టీఆర్ఎస్‌పై యుద్ధం చేస్తుండ‌టంతో టీఆర్ఎస్ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డిపోయింది. ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌కు తొత్తులా మారిపోయార‌ని గులాబీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు ప్ర‌జల్లోకి వెళ్ల‌డం లేదు. దీంతో ఆయ‌న కులాన్ని తెరపైకి తెచ్చి.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై వ్య‌తిరేక భావాన్ని ర‌గిల్చేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు పాకులాడుతున్నారు. దీంతో రెడ్డి సామాజిక‌వ‌ర్గం త‌మ‌పై దాడి చేస్తోందని ఎదురు దాడి చేసే అవ‌కాశ‌ముంద‌ని వారి వ్యూహం!

కోదండరాం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అయినా చాలాకాలం కిందటే ఆ రెడ్డి పేరును కత్తిరించుకున్నారు. గతంలో దళితులపై జరిగిన ఊచకోతలకు నిరసనగా తన పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకుంటున్నట్లు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవరూ రెడ్డి ప‌దాన్ని తగిలించి విమర్శలు చేయలేదు. ప్ర‌స్తుతం ఆయన స్వయంగా తొలగించిన ఆ పేరును టీఆరెస్ నేతలు పనిగట్టుకుని మళ్లీ తెర‌పైకి తీసుకొచ్చారు. మంత్రులు – ఎమ్మెల్యేలు – ఎంపీలు ఇలా టోటల్ కేసీఆర్ వర్గమంతా కోదండరాం పోరాటం వెనుక కులం కోణాలను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కోదండరామ్ కు కుల ముద్ర వేసి.. కుల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేయడం అంతటా ఆసక్తికరంగా మారింది. దీనిపై టీఆరెస్ పైనా విమర్శలొస్తున్నాయి. సాధారణ రాజకీయ నేతలను విమర్శించినట్లుగా కోదండరాంపైనా ఇలా కుల రాజకీయాల ముద్ర వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం భుజంభుజం కలిపి తిరిగినప్పుడు కోదండరాం కులం ఎందుకు ఆలోచించ‌లేదో వారికే తెలియాలి!!

 

కోదండ‌రాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share