కోస్తాంధ్రలో వైసీపీ పరిస్థితి బాగాలేదన్న జగన్ వ్యూహకర్త

February 24, 2017 at 9:54 am
add_text

పార్టీలో సీనియ‌ర్లు ఎంద‌రు చెప్పినా.. విశ్లేష‌కులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్లు మాట్లాడే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తొలిసారి ఒక‌రి మాట వినబోతున్నాడు. అంతేకాదు ఆయ‌న ఆదేశాల మేర‌కు త‌న `రెండేళ్ల‌లో నేనే సీఎం.. ఆరు నెల‌ల్లో నేనే సీఎం.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే` అనే `పేటెంట్‌` ప‌దాలను కూడా వ‌దిలేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం త‌న ప్ర‌సంగాల పంథాను మార్చుకోబోతున్నాడు. మ‌రి ఈ స‌ల‌హాల‌న్నీ ఇచ్చింది మ‌రెవ‌రో కాదు.. బిహార్ ఎన్నిక‌ల్లో నితీశ్ కుమార్ వెన్నంటే ఉండి.. ఆయ‌న విజ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. వ్యూహ‌క‌ర్త‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిశోర్‌!!

ఏ స‌భ‌కు వెళ్లినా.. జ‌గ‌న్ కొన్ని డైలాగులు ప‌దే ప‌దే చెబుతుంటారు. వాటిలో `రెండేళ్లలో నేనే ముఖ్య‌మంత్రిని` అనేది అంద‌రికీ బాగా గుర్తుంటుంది. అభిమానుల‌ను ఉత్సాహ ప‌రచ‌డానికి చెబుతారో లేక ఏదైనా స‌ర్వే ప్ర‌కారం చెబుతారో గాని.. ఈ మాట‌లు విన్న ఆయ‌న అభిమానులు మాత్రం సంతోషంతో పుల‌కించిపోతారు. అయితే ఇప్పుడు వీరంద‌రికీ నిరాశ క‌లిగించే విష‌య‌మేంటంటే.. ఇక జ‌గ‌న్ నోటి వెంట ఆ మాట‌ల‌ను విన‌లేం!! మాటిమాటికి `ఎన్నికలొచ్చేస్తాయ్… నేనే సీఎం` అని అనొద్ద‌ని, కొంత‌కాలం వాటిని వాయిదా వేయాల‌ని జగన్ తో ప్రశాంత్ కిశోర్ చెప్పారట.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అనుసరించాల్సిన వ్యూహాల గురించి జగన్ ఇప్పటికే అనధికారికంగా ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా.. ఇప్ప‌టికే వైసీపీ అధినేత గురించి ప్రశాంత్ ఆరా తీశారట. జగన్ మాటతీరు… పార్టీ నేతలతో ఆయన ఇంటరాక్షన్ ఎలా ఉంది? ఆయన గురించి జనం ఏమనుకుంటు న్నారు? జిల్లాల వారీగా వైసీపీ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ సర్వే చేయించారట. ఆ సర్వేలో జగన్ నడవడికపై కొన్ని స్పష్టమైన అభిప్రాయలొచ్చాయట. దాని ప్రకారం జ‌గ‌న్‌ మాటతీరు మార్చుకోవాలని స‌ల‌హా ఇచ్చార‌ట‌.

అంతేగాక పార్టీ పరిస్థితి కోస్తాంధ్రలో అస‌లు బాగా లేదని, అర్జెంటుగా అక్కడ పార్టీని రిపేర్ చేయాలని సూచించారని సమాచారం.  టీడీపీ, జ‌న‌సేన బ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ పరిస్థితుల్లో వ్యూహం మార్చితే తప్ప లాభం లేదని ప్రశాంత్ గట్టిగానే చెప్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అందుకే ప్రశాంత్ స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. మ‌రి ప్ర‌శాంత్ వ్యూహాలు ఏపీలో ప‌నిచేస్తాయో లేదో!!

కోస్తాంధ్రలో వైసీపీ పరిస్థితి బాగాలేదన్న జగన్ వ్యూహకర్త
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share