చంద్ర‌బాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని

December 23, 2016 at 5:19 am
Kodali Nani

కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో ఒక‌డిగా రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు గుర్తుకు వ‌స్తాడు. కృష్ణా జిల్లా గుడివాడ‌ను ద‌శాబ్దంన్న‌ర‌గా శాసిస్తోన్న నానిది అక్క‌డ ఓన్లీ వ‌న్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా గెలుపు మాత్రం నానీదే. గ‌తంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్ర‌స్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వ‌ర్గాల‌కు బ‌ద్ధ శ‌త్రువుగా మారాడు.

నాని టీడీపీని వీడిన‌ప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు చేశారు. అప్ప‌టి నుంచి నానిని టీడీపీ బాగా టార్గెట్ చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో నానిని ఓడించేందుకు చంద్రబాబు, లోకేష్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా నాని మూడోసారి గెలుపొంది..గుడివాడ‌లో హ్యాట్రిక్ కొట్టాడు. తాజాగా కొడాలి నాని ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు వేసిన ఎత్తుకు దిమ్మ‌తిరిగే పై ఎత్తు వేసి షాక్ ఇచ్చాడు.

కృష్ణా జిల్లాకు చెందిన పామ‌ర్రు వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేర‌కు క‌ల్ప‌న ఎంట్రీకి చంద్ర‌బాబు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. నానితో పాటే క‌ల్ప‌న టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్లి… పామ‌ర్రు నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇప్పుడు క‌ల్ప‌న టీడీపీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. అయితే ఇక్క‌డే నాని బాబుకు త‌న ట్విస్ట్‌తో షాక్ ఇచ్చారు.

పామ‌ర్రులో టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వ‌ర్ల రామ‌య్య క‌ల్ప‌న టీడీపీ ఎంట్రీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వ‌ర్ల రామ‌య్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌ర్ల వైకాపాలోకి వ‌చ్చేలా ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే చంద్ర‌బాబు ఎత్తుతో క‌ల్ప‌న‌ను టీడీపీలోకి తీసుకెళితే నాని పైఎత్తుతో టీడీపీ నుంచి వ‌ర్ల‌ను వైకాపాలోకి తీసుకొచ్చిన‌ట్ల‌వుతుంది.

క‌ల్ప‌న టీడీపీలోకి వ‌స్తుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర్ల‌కు టిక్కెట్టు రాద‌ని క‌న్‌ఫార్మ్ అయిపోయింది. దీంతో వైకాపా టిక్కెట్టు హామీతో కొడాలి నాని మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసి వ‌ర్ల‌ను వైకాపాలోకి తీసుకెళ్లిపోతున్న‌ట్టు కృష్ణా పాలిటిక్స్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీలో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డంతో వ‌ర్ల సైతం సైకిల్ దిగేందుకు రెడీ అయ్యార‌ట‌. చంద్ర‌బాబు ఇద్ద‌రు మంత్రుల‌ను పంపి బుజ్జ‌గించినా వ‌ర్ల బెట్టువీడ‌లేద‌ని తెలుస్తోంది.

 

చంద్ర‌బాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share