చిన్న‌మ్మకు ఊహించ‌ని షాకిచ్చిన ప‌ళ‌ని

February 25, 2017 at 11:30 am
Palani

న‌మ్మిన బంటును సీఎం పీఠంపై ఉంచి.. జైలు నుంచే త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావించిన శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. త‌న మాటే శాసనంగా ప‌నిచేస్తార‌ని భావించిన వ్య‌క్తి.. ఆమెకు దిమ్మతిరిగి పోయాలా చేశారు. `నేను రిమోట్ ద్వారా ప‌నిచేసే ముఖ్య‌మంత్రిని కాదు` అంటూ.. చిన్న‌మ్మ‌కు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు పళ‌నిస్వామి! ఏ రాజ‌కీయ అనుభ‌వం లేని శ‌శికళ మాట త‌నెందుకు వినాలని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శ‌గా తాను చెప్పిన వ్య‌క్తిని నియ‌మించాల‌ని శ‌శిక‌ళ పంపిన ఆదేశాలు..పాటించ‌న‌ని స్ప‌ష్టంచేశారు. పాల‌న‌తో తానేంటో నిరూపించేందుకు ప‌ళ‌ని సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే త్వ‌ర‌లోనే చిన్న‌మ్మ శ‌కం కూడా ముగిసిపోవ‌చ్చంటున్నారు విశ్లేష‌కులు!!

చిన్న‌మ్మ ద‌య‌తో సీఎం పీఠానెక్కిన ప‌ళ‌ని.. విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అమ్మ న‌మ్మిన బంటుగా ప‌న్నీర్ సెల్వానికీ త‌న‌కూ చాలా వైరుధ్యం ఉంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. జైలులో ఉన్న స‌మ‌యంలో మాజీ సీఎం జ‌య‌లలిత పంపిన ఆదేశాలు తూచ త‌ప్పకుండా పాటించేవారు ప‌న్నీర్‌!! అమ్మ కూర్చునే సీఎం పీఠంపై కాకుండా ప‌క్క‌నే కూర్చునే వారు. అయితే ప‌ళ‌ని నేరుగా అమ్మ కుర్చీలోనే కూర్చుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. చిన్న‌మ్మ న‌మ్మిన‌బంటు అనే ముద్ర‌ను వేసుకునేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవల అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ బెంగళూరు జైల్లో ఉన్న శశికళను కలిశారు. ఈ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి శశికళ ఓ జాబితాను దిన‌క‌ర‌న్‌కు శ‌శిక‌ళ అందిచార‌ట‌. దానిని పళనిస్వామికి ఇచ్చి చిన్నమ్మ ఆదేశాలను అమలు చేయాలని ఆర్డరేశార‌ట‌. చిన్నమ్మ పంపిన జాబితాలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గిరిజా వైద్యనాథన్ ను ఆ స్థానం నుంచి తొలగించి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కె. షన్మగంను నియమించాలని ఉంది. అయితే కీలక అధికారులను బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన పళనిస్వామి… ఆ జాబితాను బుట్టదాఖలు చేశారట.

రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు పరిణామాలు ప్రభుత్వ పరువును బజారు కీడ్చాయని భావించిన పళని.. చిన్నమ్మ ఆదేశాలను అమలు చేసేది లేదని చెప్పేశారట. అంతేకాదు.. అమ్మ జైల్లో ఉంటే… ఆమె భక్తుడు పన్నీర్ ఎప్పుడు పిలిస్తే… అప్పుడు వెళ్లేవారు. ఇందుకు విరుద్ధంగా శశికళను కలిసేందుకు బెంగళూరు వెళ్లాలంటేనే పళని విసుక్కుం టున్నారట. బెంగళూరు వెళ్లేది లేదని, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని చిన్నమ్మ తమకు దిశానిర్దేశం చేయడమేమిటని కూడా పళని తన సన్నిహితుల వద్ద కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారట. మొత్తానికి శ‌శిక‌ళ‌కు త‌గిన శాస్తి జ‌రిగింద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!!

 

చిన్న‌మ్మకు ఊహించ‌ని షాకిచ్చిన ప‌ళ‌ని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share