జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?

February 16, 2017 at 10:11 am
add_text

ఒక వ్య‌క్తికి కోర్టు జ‌రిమానా విధించింది.. తీరా అది క‌ట్టే లోగానే ఆ వ్య‌క్తి చ‌నిపోతే.. ఇప్పుడు ఆ జ‌రిమానా ఎవ‌రు క‌ట్టాలి? అత‌డికి కుటుంబ‌స‌భ్యులు కూడా లేక‌పోతే ఏం చేయాలి?  ఆ జ‌రిమానా ప‌రిస్థితి ఏమిటి? ఇప్పుడు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు విధించిన రూ.100కోట్ల ను ఎవ‌రు కట్టాల‌నే అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌ల‌లిత ప్ర‌ధాన దోషిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆమెకు రూ.100కోట్లు జ‌రిమానా విధిస్తూ కింది కోర్టు తీర్పును వెలువ‌రించింది. ఇప్పుడు ఈ కేసులో సుప్రీం పూర్తిస్థాయి ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో.. ఇప్పుడు ఈ రూ.100 కోట్లు వ‌సూలు చేస్తారా లేదా అనేది ప్ర‌శ్న‌గా మారింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందికోర్టు జయలలితకు విధించిన జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చి తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెకు సంబంధించిన అప్పీళ్లను (చర్యలను) మాత్రం నిలిపివేసింది. మరి… ఆమెకు విధించిన జ‌రిమానా రూ.100కోట్ల మాటేమిటి? జైలు శిక్ష అనుభవించేందుకు జయ జీవించి లేరు సరే! మరి… ఆమె ఆస్తులను విక్రయించి రూ.వంద కోట్లు వసూలు చేసే అవకాశం లేదా? జన సామాన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇది. దీనికి… స్పష్టమైన సమాధానం చెప్పలేమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.  దీనిపై సుప్రీంకోర్టే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

కిందికోర్టు చెప్పిన శిక్షను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించిన నేప‌థ్యంలో జయ రూ.100కోట్ల జరిమానా చెల్లించాల్సిందే. అయితే, ఆ మొత్తాన్ని ఎలా వసూలు చేయాలనే అంశాన్ని 570 పేజీల తన తీర్పులో సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో, దోషులకు చెందిన ఆరు కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికీ, రూ.వందకోట్ల జరిమానాకూ సంబంధం లేదు. `జయ మరణించినందున ఆమెపై క్రిమినల్‌ కేసులో చర్యలను మాత్రమే నిలిపివేశారు. ఆమె కట్టాల్సిన రూ.వందకోట్ల జరిమానాను రద్దు చేయలేదు. జయలలిత ఎస్టేట్‌ నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేయవచ్చు` అని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ హెగ్డే అభిప్రాయపడ్డారు.

ఒకవేళ… జరిమానా వసూలు చేయాల్సిందేనని ఆదేశిస్తే, జయకు చాలా ఆస్తులే ఉన్నాయి. పోయెస్‌ గార్డెన్‌ బంగ్లా, హైదరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రం, మరికొన్ని ఆస్తులను విక్రయించి… జరిమానా కింద జమ కట్టేయవచ్చేనేది హెగ్దే అభిప్రాయం.  మరోవైపు… ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషులు శశికళ, ఇళవరసి, సుధాకరనలకు ఒక్కొక్కరికీ రూ.10 కోట్ల చొప్పున కోర్టు విధించిన జరిమానా ఎలా వసూలు చేస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. జరిమానాల లెక్కే కాదు… సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలపై మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.

జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share