జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు వ్యూహం ఇదేనా?!

January 28, 2017 at 11:59 am
AP

పొలిటిక‌ల్‌గా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే టీడీపీ, వైకాపాల మ‌ధ్య ఇప్పుడు హోదా రూపంలో మ‌రింత అగ్గి రాజుకుంది! ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ నేతృత్వంలో మొన్న త‌ల‌పెట్టిన శాంతి యుత ప్ర‌ద‌ర్శ‌న‌కు బాబు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌కుండా మొగ్గ‌లోనే తొక్కేసిన విష‌యం కొన్ని మీడియా ఛాన‌ళ్లు దాచి పెట్టినా.. సోష‌ల్ మీడియా ఎవ‌రి కొమ్మూ కాయ‌దు కాబ‌ట్టి.. దీని ద్వారా అంద‌రికీ అర్ధ‌మైపోయింది. సో.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ మాదిరిగా ఉన్న జ‌గ‌న్ రేటింగ్ ఇప్పుడు హైరేటింగ్ లెవిల్స్‌ని తాకుతోంద‌ని స‌మాచారం. ముఖ్యంగా యువ‌త త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మాన్ని తానే భుజాన వేసుకోవ‌డం జ‌గ‌న్‌కి క‌లిసొచ్చిన అంశం.

ముందు యువ‌త‌కు ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చాడు. తాను ఉన్నాన‌ని, ఉద్య‌మాన్ని ముందుకు తీసుకు వెళ్లాల‌ని, శాంతి యుత ఉద్య‌మాల‌కు జ‌న‌సేన ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని పెద్ద ఎత్తున క‌విత‌లు, ట్వీట్ల‌తో ప‌వ‌న్ రెచ్చిపోయాడు. దీనిని యువ‌త స్పూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున క‌దిలారు. కానీ, ఇంత‌లో ఏమైందో ఏమో.. ప‌వ‌న్ సైలైంట్‌!! వాస్త‌వానికి ఈ విష‌యంపై అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వ్యూహంలేని జ‌గ‌న్‌.. యువ‌త పిలుపుతో క‌దిలాడు. తానున్నాన‌ని చెబుతూనే త‌న పార్టీ వారంతా క‌ద‌లాల‌ని పిలుపు నిచ్చాడు. యువ‌త‌కు ద‌న్నుగా తాను ముందుంటాన‌ని విశాఖ‌లో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటాన‌ని పిలుపునిచ్చాడు.

అయితే, దీనినంత‌టినీ గ‌మ‌నించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇది గ‌నుక స‌క్సెస్ అయితే, జ‌గ‌న్ ఖాతాలో ప్ర‌జా బ‌లం ముఖ్యంగా యువ‌త బ‌లం పెరిగిపోతుంద‌ని భావించి.. అడుగ‌డుగునా ఆంక్ష‌ల సంకెళ్ల‌ను విధించారు. దీంతో నిజానికి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి అనుమ‌తి ఇచ్చి ఉన్నా అది ఇంత పెద్ద ఎత్తున వార్త కాక‌పోయేది. దీనికి అనుమ‌తి నిరాక‌రించ‌డం స‌హా.. ప్ర‌తి ప‌క్ష నేత‌ను విమానాశ్ర‌యంలో అడ్డ‌గించ‌డం, బ‌య‌ట‌కు కూడా రాకుండా హైద‌రాబాద్‌కి తిప్పి పంప‌డం వంటివి పెద్ద ఎత్తున ప్ర‌చారం తెచ్చిపెట్టాయి. ఇది అధికార ప‌క్షానికి యాంటీగా మార‌గా.. జ‌గ‌న్ ఖాతాలో మంచి మార్కులే వేసింది.

దీంతో చంద్ర‌బాబు .. ఇప్పుడు జ‌గ‌న్ ను ఏదో విధంగా ఇరుకున పెట్టాల‌ని, క‌ట్ట‌డి చేయాల‌ని వ్యూహాలు సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. జ‌గ‌న్ చేప‌ట్టిన అదే నిర‌స‌న ఆధారంగా ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని, త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా అంతా జ‌రిగిపోయేలా కూడా బాబు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నార‌ని స‌మాచారం. విశాఖ విమానాశ్ర‌యంలో త‌న‌ను అడ్డ‌గించిన పోలీసుల‌తో జ‌గ‌న్ వ్యాఖ్యానించిన తీరుపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టార‌ని స‌మాచారం. అభ్యంత‌రక‌ర ప‌దాలు.. రెండేళ్ల‌లో త‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది. అంద‌రినీ పేరుపేరునా గుర్తు పెట్టుకుంటాను వంటి జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను పోలీసులు రికార్డు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు పోలీసుల‌ను బెదిరించేవిగా ఉన్నాయ‌ని, చ‌ట్టాన్ని కాపాడే వృత్తిలో ఉన్న త‌మ‌నే బెదిరించ‌డం… ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని, దీనిపై ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. భ‌విష్య‌త్తులో మ‌రింత మంది పోలీసుల‌పై ఇలానే రెచ్చిపోయే ఛాన్స్ ఉంద‌ని .. పోలీసులు(బాబు క‌నుస‌న్న‌ల్లో) భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రో రెండు మూడు రోజుల్లో(ప్ర‌స్తుతం భాగ‌స్వామ్య స‌ద‌స్సు జ‌రుగుతోంది. ఇది అయిపోగానే దీనిపై దృష్టి పెడ‌తార‌ని స‌మాచారం.) దీనికి సంబంధించి జ‌గ‌న్‌పై కేసులు న‌మోదు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి పోలీసులను బెదిరించ‌డం అంటే.. నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్ కింద‌కు వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. సో.. ఇలా చంద్ర‌బాబు ప‌రోక్షంగా జ‌గ‌న్‌ని క‌ట్ట‌డి చేసేందుకు ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. మ‌రి లోట‌స్ పాండ్ వ‌ర్గాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

 

జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు వ్యూహం ఇదేనా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share