జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు

January 21, 2017 at 10:42 am
Pawan

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! నేత‌లు ఎప్పుడూ ఒకే పార్టీని న‌మ్ముకుని ఉంటార‌న్న గ్యారెంటీ ప్ర‌స్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరిక‌లు నెర‌వేర‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా నేత‌లు త‌మ‌కు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి ప‌క్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీల‌కు కొద‌వ‌లేదు. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవ‌ల దాకా క్యూ క‌ట్టి మ‌రీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేత‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నేత‌లూ జంపింగ్‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాక్‌. అయితే, వీరంతా ఏ పార్టీలోకి వెళ్తారు? ఆ అవ‌స‌రం ఏంటి? అంటే.. ఇది చ‌ద‌వాల్సిందే!

ప్ర‌శ్నిస్తాను? పేద‌ల ప‌క్షాన నిలుస్తాను అంటూ 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ జ‌న‌సేనను స్థాపించారు. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల్లో క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉండిపోయారు. కానీ, ఇటీవ‌ల మ‌ళ్లీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించ‌డ‌మే కాకుండా త‌న‌కు తెలిసిన ఏదైనా స‌మ‌స్య‌పై ప్ర‌త్య‌క్ష పోరాటానికే దిగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటు రైతులు, అటు కొన్ని వ‌ర్గాల వారు సైతం ప‌వ‌న్‌ని ఆశ్ర‌యిస్తున్నారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. నిజంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నామ‌ని చెబుతున్న విప‌క్ష వైకాపాకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న స్పంద‌న‌క‌న్నా సైలెంట్‌గా దూసుకుపోతున్న ప‌వ‌న్‌కే ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు పెరుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప‌లు పార్టీల నేత‌లు జ‌న‌సేన వంక చూస్తున్నార‌ని టాక్! ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ పెరుగుతున్న జ‌న‌సేనాని పంచ‌న చేరితే వారికి కూడా మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్న నేత‌ల సంఖ్య రానురాను పెరుగుతోంది. ఇటీవ‌లి శ్రీకాకుళం కిడ్నీ సంఘ‌ట‌న అనంత‌రం జ‌న‌సేన వంక చూస్తున్న వారి సంఖ్య డ‌బుల్ అయింద‌ని వినిపిస్తోంది. వైకాపా, కాంగ్రెస్ స‌హా చిన్నా చిత‌కా పార్టీల నుంచి కూడా జ‌న‌సేన‌లోకి వ‌చ్చేందుకు రెడీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో ముఖ్య మైన విష‌యం ఏంటంటే.. అధికార టీడీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్టు కేటాయించ‌డం డౌటే అని భావిస్తున్న కొంద‌రు నేతలు సైతం సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.

ఇక‌, వామ‌ప‌క్షాలు సైతం త‌మ‌కో తోడు కావాల‌ని పేర్కొంటూ.. ప‌వ‌న్ త‌న సిద్ధాంతాన్ని పేర్కొంటే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాయి. ఇలా.. అన్ని ప‌క్షాల నుంచి జ‌న‌సేనలో చేరేందుకు నేత‌లు సిద్ధ‌మైపోతున్నారు. అయితే, ఇక్క‌డ ఉన్న చిక్క‌ల్లా… జ‌న‌సేనాని త‌న పంథా ఏంటో ఇప్ప‌టికీ వెల్ల‌డించ‌క‌పోవ‌డ‌మే! తాను ఎవ‌రినీ ఇప్ప‌టి వ‌ర‌కు స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వానించ‌లేదు. అదేవిధంగా త‌న పూర్తిస్థాయి అజెండా వెల్ల‌డించ‌లేదు. క్యాడ‌ర్‌ని ప‌టిష్టం చేయ‌లేదు. దీంతో ఈ జంపింగ్‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ వీరిని ఎలా ట్రీట్ చేస్తాడో చూడాలి.

 

జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share