టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !

January 30, 2017 at 9:43 am
1970

`తెలుగుదేశం పాల‌న‌లో అవినీతి తార‌స్థాయికి చేరింది..` ఇది నిత్యం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌! దీనిని ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌దే లేదు. కానీ ఇదే విమ‌ర్శ మిత్ర‌ప‌క్ష ఎమ్మెల్యే చేస్తే అది నిజంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే అంశ‌మే!! అలా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించారు ఏపీ బీజేపీ ప‌క్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! ఇప్పుడు ఆయ‌న  టీడీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి భాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసి.. మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతోనే క‌య్యానికి కాలుదువ్వుతున్నారు!! దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా వ్య‌వ‌హారం మారింది.

విశాఖ‌లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమంటున్నాయి! ముఖ్యంగా పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అవినీతిని విష్ణుకుమార్ రాజు వెలుగులోకి తీసుకురావ‌డంలో వివాదం రాజుకుంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నప‌రిధిలోని ముదపాకలో రైతుల భూములను టీడీపీ నేతలు కారు చౌకగా కొల్లగొడుతున్న వైనాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి బాధితుల‌తో వెళ్లి క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ భూములలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న వారికి వంద గజాల లోపు ఉచితంగా పట్టాలు ఇస్తూ బాబు సర్కార్‌ జారీ చేసిన మరో జీవోను అక్క‌డి టీడీపీ నేత‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఎకరాలకు ఎకరాలు సర్కారీ భూములను తీసేసుకుని వాటిని వందల గజాలుగా చూపిస్తూ బినామీ లబ్దిదారుల ద్వారా ప్రభుత్వం నుంచి ఉచిత పట్టాలను పొందారన్న విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం తతంగం వెనుక టీడీపీ సర్పంచ్‌ ఉన్నారని విష్ణు ఆరోపించడమే కాకుండా ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఫైర్‌ అవుతున్నారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టడానికి ఆయనెవరంటూ నిలదీస్తున్నారు.

తన నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో దోస్తీ కట్టి తనను బదనాం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఒక సీనియర్‌ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భూ దందా సాగడం, దానిని సాటి మిత్రపక్ష ఎమ్మెల్యే వెలుగులోకి తేవడంతో జిల్లా టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. మరి ఈ విష‌యంలో టీడీపీ,, బీజేపీ నేత‌లు ఏవిధంగా స్పందిస్తారో తేలాల్సి ఉంది!

టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share