టీ కాంగ్రెస్‌లో ఆ ప‌ద‌వి అంటేనే భ‌యం…భ‌యం

December 23, 2016 at 7:36 am
Congress

ప‌ద‌వి అంటే ఎవ‌రికైనా ఎంత ఆశ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ద‌వి వ‌స్తుందంటే చాలు అది పార్టీ ప‌ద‌వి అయినా… ప్ర‌భుత్వ ప‌ద‌వి అయినా నాయ‌కులు ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఓ ప‌ద‌వి విష‌యంలో భ‌యం భ‌యంగా ఉంటున్నార‌ట‌. ఆ ప‌ద‌వి మాకు వ‌ద్దే వ‌ద్ద‌ని తెగేసి చెప్పేస్తున్నార‌ట‌. ఆ ప‌ద‌వి ఏంటో ? ఆ ప‌ద‌వి చేప‌ట్టేందుకు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో చూద్దాం.

ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్‌పర్సన్‌ పదవిని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో పీఏసీ చైర్‌ప‌ర్స‌న్‌గా ప్ర‌స్తుతం ఉన్న గీతారెడ్డి ఆ ప‌ద‌వి ప‌ట్ల విముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొద్దికాలం క్రితం ఈ పదవిని చేపట్టిన ఆమె రెండు, మూడు సమావేశాల అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఈ ప‌ద‌వి త‌న‌కు వ‌ద్ద‌ని చెప్పేశార‌ట‌.

దీంతో టీ కాంగ్రెస్ లీడ‌ర్లు ఈ ప‌ద‌విని మ‌రో సీనియ‌ర్ నేత‌, జ‌గిత్యాల ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిని చేప‌ట్ట‌మ‌న్నార‌ట‌. ఆయ‌న నో చెప్పేశార‌ట‌. త‌ర్వాత వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని అడిగితే ఆయ‌న సైతం వామ్మో నాకు వ‌ద్ద‌ని దండం పెట్టేశార‌ట‌. మ‌రి ఈ ప‌ద‌వి అంటే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఎందుకంత భ‌యం అంటే ఈ ప‌ద‌వి చేప‌ట్టిన ఎమ్మెల్యేలు చ‌నిపోవ‌డ‌మో లేదా తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డ‌మో జ‌రుగుతోంది.

ముందుగా ఈ ప‌ద‌విని మెద‌క్ జిల్లా నారాయ‌ణ్‌ఖేడ్ ఎమ్మెల్యే ప‌ట్లోళ్ల కిష్టారెడ్డి చేప‌ట్టారు. ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉండ‌గానే మ‌ర‌ణించారు. త‌ర్వాత ఖ‌మ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేప‌ట్టారు. ఆయన కూడా ప‌ద‌విలో ఉండ‌గానే మృతిచెందారు. త‌ర్వాత బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌హీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. ఆమె ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న‌ట్టు చెప్ప‌డంతో ఇప్పుడు ఆ ప‌ద‌వి చేప‌ట్టేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఆ పదవిలో ఉన్నవారికి ప్రాణగండం ఉందనే సెంటిమెంట్‌ బలంగా పనిచేస్తుండ‌డంతో ఆ ప‌ద‌వి చేప‌ట్టేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.

 

టీ కాంగ్రెస్‌లో ఆ ప‌ద‌వి అంటేనే భ‌యం…భ‌యం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share