తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం

February 28, 2017 at 9:23 am
129

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్న‌మ్మ‌.. అటు అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వంల మ‌ధ్య జ‌రిగిన‌ చేప‌ల మార్కెట్ ర‌గ‌డ దేశం మొత్తాన్ని ఉత్కంఠ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత చిన్న‌మ్మ జైలుకెళ్ల‌డం.. ప‌ళ‌ని స్వామి సీఎం కావ‌డం ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంత‌టితో పాలిటిక్స్ చ‌ల్లార‌లేదు. త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారిలో మ‌రోప‌క్క ప‌న్నీర్ ర‌గ‌డ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే. ఇప్పుడు మ‌రో కోణం కూడా వెలుగులోకి వ‌చ్చింది.

అమ్మ పార్టీకి అస‌లు వార‌సురాలిని తానే నంటూ .. జ‌య అన్న కుమార్తె దీప అప్ప‌ట్లో హ‌డావుడి సృష్టించింది. ఇక‌, ఆ త‌ర్వాత ఒకింత తెర‌మ‌రుగైపోయినా.. మ‌ళ్లీ ఇప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చింది. దీనికి కార‌ణం ఏంటంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మే 14వ తేదీలోపు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇదే స‌మ‌యంలో అటు ప‌న్నీర్ వ‌ర్గం… ఇటు దీప కూడా పొలిటిక‌ల్ గా ప్రిప‌రేష‌న్ మొద‌లు పెట్టాయి.

అంతేకాదు, అమ్మ పార్టీ ఎన్నిక‌ల గుర్తు.. రెండాకులు త‌మ‌దే నంటూ ప‌న్నీర్ సెల్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, అమ్మ‌కు అత్యంత విధేయుడిని తానేన‌ని, అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకులకు ‘బలపరీక్ష’ తప్పదనే సంకేతాలను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పంపారు. ఇప్పటికే శశికళ తనపై, తన మద్దతుదారులపై వేసిన పార్టీ బహిష్కరణ వేటును తప్పించుకునేందుకు ఆయన ఎన్నికల సంఘం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఎన్నికల గుర్తునూ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న విషయాన్ని స్పష్టం చేశారు.

ఇక‌, జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన దీప కూడా అన్నాడీఎంకే పగ్గాలను శశికళ వర్గం నుంచి దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆమె కూడా స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూడా రెండాకుల గుర్తు త‌న‌కే కేటాయించాల‌ని కోరే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది నిజంగా రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సంఘం ద్వారా పన్నీర్‌సెల్వం న్యాయపోరాటం చేస్తున్నారు. దీప మాత్రం ఎలాంటి చర్యలు చేపడతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో దీప చర్యలను శశికళ వర్గం మరింత నిశితంగా పరిశీలిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share