తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!

February 7, 2017 at 10:53 am
54

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు కీల‌క మ‌లుపుతిరిగాయి! ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాల‌ని క‌ల‌లు క‌న్న శ‌శిక‌ళ కేంద్రంగా ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్లిక‌ట్టు ఆడేస్తోంది! శ‌శిక‌ళ‌ను సీఎం కాదుక‌దా.. ఆ సీటు ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌కుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హ‌యాంలో వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్‌ను త‌ల‌ద‌న్నేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. త‌మిళ‌నాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌ల‌లిత మృతి చెందిన త‌ర్వాత ఆ సీటులో ఆమె విశ్వాస‌పాత్రుడు ప‌న్నీర్ సెల్వం కొలువుదీరారు.

అయితే, అంద‌రూ ఆయ‌నే ప‌ర్మినెంట్ సీఎం అనుకున్నారు. కానీ, ఈ సీటుపై క‌న్నేసిన జ‌య నెచ్చెలి.. శ‌శిక‌ళ .. ఎప్పుడెప్పుడు ప‌న్నీర్‌కు మంగ‌ళం పాడ‌దామా అని ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా జ‌య మ‌ర‌ణించి క‌చ్చితంగా 60 రోజులకు త‌మిళ‌నాడు సీఎంగా శ‌శిక‌ళ కూర్చుంటారు అనే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చారు. అధికార పార్టీ అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ శ‌శిక‌ళ‌కు జై కొడుతూ.. పార్టీ అసెంబ్లీ ప‌క్ష నేత‌గా ఆమెను ఎన్నుకున్నారు. అంతేకాదు, ప‌న్నీర్ సైతం .. ఎలాంటి పేచీ లేకుండానే రాజీనామా చేసేశారు.

దీంతో శ‌శిక‌ళ సీఎం అయిపోవ‌డం ఖాయం అనుకున్నారు అంద‌రూ. కానీ. ఈ టైంలోనే కేంద్రం తెర‌వెనుక చ‌క్రం తిప్పింది. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావును చెప్పుచేత‌ల్లోకి తీసేసుకుంది. శ‌శిక‌ళ‌కు సీఎం సీటు ద‌క్క‌కుండా సుప్రీ కోర్టులో కేసును బూచిగా చూపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌తో పాటు రెండో ప్ర‌ధాన నిందితురాలిగా శ‌శిక‌ళ ఉన్నారు. ఈ కేసు విచార‌ణ ఈ నెల 10న రానుంది. దీంతో దీనిని సాకుగా తీసుకున్న గ‌వ‌ర్న‌ర్‌.. ఈ విష‌యంలో న్యాయ స‌ల‌హా కోరుతున్న‌ట్టు చెబుతూ.. అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లిపోయారు.

కానీ, రాజ్యాంగం ప్ర‌కారం.. న్యాయా న్యాయ విచ‌క్ష‌ణ‌ల‌తో సంబంధం లేకుండా.. అసెంబ్లీ ప‌క్ష నేత‌గా ఎవ‌రు ఎంపికైతే.. వారితో సీఎంగా ప్ర‌మాణం చేయించాల్సిన క‌నీస ధ‌ర్మం గ‌వ‌ర్న‌ర్‌ది. కానీ, విద్యాసాగ‌ర‌రావు మాత్రం దీనికి విరుద్ధంగా వ్య‌వహ‌రిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కే ఆయ‌న ఢిల్లీ బాట‌ప‌ట్టారు. దీంతో శ‌శిక‌ళ ప్ర‌మాణ స్వీకారం మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ వాయిదా ప‌డింది. ఇదంతా ప్ర‌ధాని మోడీ, బీజేపీ జాతీయ సార‌ధి అమిత్ షాల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌క్షాన నిల‌బ‌డితే.. వారిదే రాజ్యాధికారం. మ‌రి కేంద్రం ఇలా చేయ‌డం స‌రేనా?! ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌నూ ఈ ప్ర‌శ్నే తొలిచేస్తోంది.

తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share