త‌మిళ‌నాట మ‌రోసారి రాజ‌కీయ సంక్షోభం?

April 17, 2017 at 11:05 am
sasikala

త‌మిళనాడు సీఎం పీఠాల‌ని ఎక్కాల‌ని భావించి భంగ‌ప‌డి.. జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని షాక్ ఎదుర‌వబోతోంది. తాను లేక‌పోయినా.. త‌న వ‌ర్గ‌పు వారిని పార్టీ కార్య‌ద‌ర్శిగా నియ‌మించి అక్క‌డి నుంచే చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆమెకు.. అన్నాడీఎంకే మంత్రులు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అంతేగాక ఇందుకు సంబంధించి ప‌క్కా స్కెచ్ కూడా వీరు సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ మంత్రులంతా తిరిగి ప‌న్నీర్ గూటికి చేరాల‌ని డిసైడ్ అయిపోయార‌ట‌.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆర్కేనగర్‌లో ఓటర్లకు భారీగా నగదు పంపిణీ అయిన కారణంగా ఉప ఎన్నికలు రద్దయిన నేపథ్యంలో ఈ నెల 13న దినకరన్ అడయార్‌లోని తన ఇంట్లో మంత్రులు తంగమణి, వేలుమణితో స‌మావేశ‌మ‌య్యారు. ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో జూనియర్‌ మంత్రి విజయభాస్కర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించడంపై వీరు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ఇన్ ఛార్జీలుగా సీనియర్‌ మంత్రులను నియమించేవారని, ప్రస్తుతం జూనియ‌ర్ ను నియ‌మించ‌డంతో పార్టీ అప్రతిష్ట పాలైందని, దీనికి తోడు ఆయనపై ఐటీ దాడులు జరిగి విచారణను సైతం ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇక జాప్యం చేయకుండా మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుండి తప్పించాలని ఆ ఇరువురూ కోరారు. సమావేశం పూర్తయిన తర్వాత దినకరన్ మాట్లాడుతూ…మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుంచి తప్పించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఇద్దరు మంత్రులకు మంటపుట్టించింది. వీరు నేరుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలుసుకుని తమ వాదనను వినిపించారు. శశికళ మేనల్లుడు మహాదేవన అంత్యక్రియలకు వీరు వెళ్ల‌కుండా తిరుచ్చిలోని ప్రముఖ హోటల్‌లో బసచేసి మంత్రి తంగమణితో రహస్యంగా సమావేశమయ్యారు. వీరితో పాటు ఎంపీ కూడా ఉన్నారు. సుమారు గంటకు పైగా భేటీ జ‌రిగింది.

ఇందులో పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరటమే మంచిదని ఇరువురూ అభిప్రాయపడ్డారు. 122 మంది శాసనసభ్యులున్న అధికార పార్టీలో ఆరుగురు శాసనసభ్యులు గ్రూపు మారితే ప్రభుత్వం కుప్పకూలి పడిపోతుందని, ఈ బూచిని చూపి పార్టీ పదవి నుంచి దినకరన్‌ను తప్పించి పన్నీర్‌ వర్గాన్ని చేర్చుకోవాలని ఇరువురు మంత్రులు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి తెలిపేందుకు ఇద్దరు మంత్రులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఐటీ దాడులు ఎదుర్కొం టున్న ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌కు సోమవారం ఉద్వాసన పలుకనున్నారని తెలుస్తోంది.

 

త‌మిళ‌నాట మ‌రోసారి రాజ‌కీయ సంక్షోభం?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share