త‌మిళ‌నాట రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా?!

February 28, 2017 at 8:21 am
Tamilnadu

త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ప్ప‌దా? ఆదిశ‌గా కేంద్ర‌మే పావులు క‌దుపుతోందా? ప్ర‌స్తుతం ఏర్పాటైన ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున మంత్రాంగం న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వారం కింద‌టి వ‌ర‌కు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడిన త‌మిళ‌నాడు రాజ‌కీయాలు చిన్న‌మ్మ జైలుకు వెళ్ల‌డం, ప‌ళ‌ని సీఎం సీటెక్క‌డంతో అంతా స‌ర్దుకుంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, అసెంబ్లీలో ప‌ళ‌ని బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగా జ‌రిగిన కురుక్షేత్ర ప‌ర్వం.. తాజాగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను అట్టుడికిస్తోంది.

అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌ని స్వామి వ్య‌వ‌హ‌రించిన శైలి బాగోలేద‌ని, త‌మ‌కు పోలీసుల‌తో కొట్టించార‌ని ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం డీఎంకే నేత స్టాలిన్‌.. రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, చెన్నై హైకోర్టులో దీనిపై ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం కూడా దాఖ‌లైంది. ఈ నేప‌థ్యంలో త‌మ బ‌లం ఏమిటో నిరూపించుకునేందుకు ప‌ళ‌ని స్వామి త‌న ఎంపీల‌తో మంగ‌ళ‌వారం ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తిని క‌లిసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో మాజీ సీఎం, అమ్మ‌కు అత్యంత విశ్వాస పాత్రుడు ప‌న్నీర్ సెల్వం కూడా త‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీ చేరుకున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మ‌ళ్లీ వేడెక్కాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో మ‌ద్ద‌తు లేని ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని, దీనిని కూల‌దోసి రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని అటు స్టాలిన్‌, ఇటు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు రాష్ట్ర‌ప‌తిని కోర‌నున్న‌ట్టు గ‌ట్టిగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్రం కూడా ప‌న్నీర్‌తో ఈ అంశంపైనే ఒత్తిడి పెంచేలా చేసి.. ఏదో ర‌కంగా చిన్న‌మ్మ అనుచ‌రుడుని ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని భావిస్తోంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి త‌మిళ రాజ‌కీయాలు రాబోయే రోజుల్లో మ‌రింత వేడెక్క‌నున్నాయి.

 

త‌మిళ‌నాట రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share