నాయకత్వం గొడవలో కాపు వెర్సెస్ బలిజలు

January 31, 2017 at 7:58 am
Kapu

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు, రాజ‌కీయ గుర్తింపు కోసం పోరాడుతున్న కాపు ఉద్య‌మ నేత ముద్రగ‌డ ప‌ద్మ‌నాభానికి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది, ముఖ్యంగా కాపు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బ‌లిజ సామాజిక వ‌ర్గ నేత‌లు ఇప్పుడు ఈ ఉద్య‌మం నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కాపుల‌తో పాటు త‌మ‌కూ గుర్తింపు కావాల‌ని వారు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వారు ఉద్య‌మానికి దుర‌మైతే కాపు ఉద్య‌మం అట‌కెక్కిన‌ట్టే అని సంకేతాలు వినిపిస్తున్నాయి.

కాపు సామాజిక‌వ‌ర్గంలో కోస్తాలో వారిని కాపులుగాను, రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు గాను పిలుస్తుంటారు. ఇక వీరికి ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు బీసీల్లో చేర్చే అంశంపై హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ర‌క‌ర‌కాల మార్గాల్లో ఉద్య‌మాలు చేప‌డుతున్నారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. అయితే వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు అణిచివేస్తోంది ప్ర‌భుత్వం!! ప్ర‌భుత్వ అణిచివేత‌కు తోడుగా ఇప్పుడు కాపుల ఉద్య‌మంలో చీలిక‌లు వ‌స్తున్నట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి! కాపుల్లో తాము మెజారిటీ సంఖ్య‌లో ఉన్నామంటూ బ‌లిజ‌లు చీలిపోతున్నారు! త‌మ‌కు రాజ‌కీయ గుర్తింపు కావాలంటూ నిన‌దిస్తున్నారు.

కాపుల్లో ప్ర‌ధానంగా తూర్పుకాపు, కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి అనే ఐదు ఉప‌కులాలున్నాయి. మెజారిటీ కాపుల సంఖ్య కోస్తా జిల్లాల్లో ఎక్కువ ఉంది. ఇక‌, రాయ‌ల‌సీమ ప్రాంతంలో బ‌లిజ‌ల శాతం ఎక్కువ‌. బ‌లిజ నాయ‌కుల లెక్క‌లేంటంటే… ఆంధ్రాలో కాపుల కంటే బ‌లిజ‌ల జ‌నాభా రెండు శాతం ఎక్కువ‌గా ఉందంటున్నారు. సంఖ్యాప‌రంగా త‌మ‌కే ఆధిప‌త్యం ఉన్నా రాజ‌కీయంగా త‌మ‌కు ఉనికి ఉండ‌టం లేద‌న్న‌ది వారి వాద‌న‌. కాపులతో పోల్చుకుంటే తాము అన్నిర‌కాలుగా వెనుక‌బాటుత‌నానికి గుర‌వుతున్నామంటున్నారు. ఇన్నాళ్లూ కాపుల నాయ‌కత్వం కింద‌నే తాము ఉండాల్సి వ‌చ్చింద‌ని బ‌లిజ నాయ‌కులు అంటున్నారు.

కాపుల్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌నీ, ఇక్క‌డ అత్య‌ధికులు బ‌లిజ‌లు ఉన్నాస‌రే ఇద్ద‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చార‌ని ఆరోపిస్తున్నారు. అయితే, రిజ‌ర్వేష‌న్ల కోసం జ‌రుగుతున్న పోరాటంలో అంద‌రూ క‌లిసే ఉందామ‌ని చెబుతూనే… త‌మ‌కు ప్రాధాన్య‌త పెంచాల‌న్న‌ది బ‌లిజ నాయ‌కుల డిమాండ్‌. బ‌లిజ‌ల ఆరోప‌ణ‌ల‌పై కాపు నేత‌లు కూడా స్పందిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్లంటూ వ‌స్తే ముందుగా న్యాయం జ‌రిగేది బ‌లిజ‌ల‌కే అని కాపు నేత‌లు స్పందిస్తున్నారు. కాపుల‌తో క‌లిసి ఉండ‌టం వ‌ల్ల‌నే త‌మకు గుర్తింపు రావ‌డం లేద‌న్న వాద‌న‌లో అర్థం లేదంటున్నారు. అంద‌రూ క‌లిసి పోరాడాల‌ని సూచిస్తున్నారు. మ‌రి కాపు ఉద్య‌మం సాగుతుందో లేదో!!

 

నాయకత్వం గొడవలో కాపు వెర్సెస్ బలిజలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share