బాబును ఏకేసిన అమ‌రావ‌తి కాంట్రాక్టు సంస్థ‌

January 29, 2017 at 5:59 am
CBN

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న అమ‌రావ‌తి నిర్మాణం ఇప్పుడు ఆయ‌న ప‌రువును ఢిల్లీ వీధుల్లోకి చేర్చింది! త‌మ‌తో ఏపీ ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వంలోని కీల‌క మంత్రి ఒక‌రు తొండి చేస్తున్నార‌ని అమ‌రావ‌తి కాంట్రాక్టు సంస్థ మాకీ అసోసియేష‌న్ పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతోంది. దీనికి సంబంధించి ప‌లు ఆంగ్ల ప‌త్రిక‌ల్లో నిన్న పెద్ద ఎత్తున క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. విష‌యంలోకి వెళ్తే.. అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయిలో నిర్మించాల‌ని చంద్ర‌బాబు పెద్ద ఎత్తున క‌ల‌లుకంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌పాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్‌కి అమ‌రావ‌తిని అప్ప‌గించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ సంస్థ విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ఢిల్లీకి చేరింది. ఏపీ ప్ర‌భుత్వం తీరుపై ఆ కంపెనీ దుమ్మెత్తి పోస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కారుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ కేంద్రానికి ఓ లేఖ రాయ‌డంతో ఏపీ స‌ర్కారు ప‌రువును బ‌జారుకు ఈడ్చిన‌ట్టే అయింది! టెండ‌ర్ ద్వారా తాము కాంట్రాక్టు ద‌క్కించుకుంటే… ఇప్పుడు ప్ర‌భుత్వం స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌ను త‌ప్పిస్తోంద‌ని కంపెనీ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. వారికి కావాల్సిన కంపెనీల‌ను అమ‌రావ‌తి డిజైన్ల త‌యారీ కోసం ఎంపిక చేసుకునేందుకు త‌మ‌ను త‌ప్పిస్తున్నారంటూ కేంద్రానికి ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.

డిజైన్ల త‌యారీ కాంట్రాక్టు నుంచి త‌మ‌ను ఎందుకు త‌ప్పిస్తున్నారో కార‌ణం ప్ర‌భుత్వం చెప్ప‌లేద‌నీ, పైగా ముంబైకి చెందిన మ‌రో కంపెనీతో క‌లిసి ప‌నిచేయాలంటూ, వాటా ఇవ్వాలంటూ ఓ మంత్రి ఒత్తిడి తెస్తున్నార‌ని కూడా మాకీ అసోసియేట్స్ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విష‌యం ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్త‌వానికి అమ‌రావ‌తి నిర్మాణం మంత్రి నారాయ‌ణ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పైనే నేరుగా సంస్థ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి మొద‌టి నుంచి పెద్ద ఎత్తున అమ‌రావ‌తి నిర్మాణాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌రి దీనిపై ఇప్పుడు మాకీ రోడ్డు కెక్క‌డం గ‌మ‌నార్హం. దీనిపై కేంద్ర, రాష్ట్రాలు ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తాయో చూడాలి.

 

బాబును ఏకేసిన అమ‌రావ‌తి కాంట్రాక్టు సంస్థ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share