బాబు ఆయ‌న‌తో అప్ర‌మ‌త్తం.. కేంద్రం హెచ్చ‌రిక‌

February 25, 2017 at 4:21 pm
CBN

ప్రముఖ ఆధ్యాత్మిక మ‌త గురువు ద‌లైలామా.. ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో రెండు సార్లు ప‌ర్య‌టించి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద‌ని ఆశీస్సులు అంద‌జేశారు. అమ‌రావ‌తిలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు ద‌లైలామాను పిల‌వ‌డం, ఆయ‌న‌తో బాబు స‌న్నిహిత సంబంధాలు నెరుపుతుండ‌టంపై కేంద్రం సున్నితంగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆయ‌న‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని, లేకుంటే ఇబ్బందులు తప్ప‌వ‌ని హెచ్చ‌రించింద‌ట‌. ఇదంతా ఎందుకంటే.. చైనాకు దలైలామా శ‌త్రువు క‌నుక‌.. ఏపీతో ఆయ‌న స‌త్సంబంధాలు కొన‌సాగిస్తే.. ఆ ప్ర‌భావం దేశీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని కేంద్రం ఆందోళ‌న చెందుతోంద‌ట‌.

కేంద్ర‌ రాష్ట్ర ప్రభుత్వాలు చైనాతో వాణిజ్యం వైపు అమితంగా ఆస‌క్తి చూపుతున్నాయి. వ్యాపార – వాణిజ్య – పారిశ్రామిక రంగాల్లో చైనాతో అనేక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. మోడీ సర్కారుకు చైనాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఇటీవల నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇక సీఎం చంద్ర‌బాబు యితే నేరుగా ఎర్రచందనం నుంచి అమరావతి నగర నిర్మాణం – పరిశ్రమలు వంటి అనేక కోణాల్లో చైనాతో చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ద‌లైలామా ప‌ర్య‌ట‌నతో కేంద్రంలో కొంత ఆందోళ‌న మొద‌లైంది.

గతం నుంచి చైనా – దలైలామా మధ్య విభేదాలున్నాయి. తాము టిబెట్ ను విడిచి వెళ్లడానికి చైనాయే కారణమని గతంలో దలైలామా అనేక పర్యాయాలు పేర్కొన్నారు. దలైలామా దేశ ద్రోహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని చైనా ఆగ్రహిస్తోంది. మ‌రి ఈస‌మ‌యంలో ఆయ‌న‌తో చంద్ర‌బాబు.. స‌న్నిహితంగా మెలుగుతున్నారు. మ‌హిళా పార్లమెంట్‌కు దలైలామా రాష్ట్రానికి రాగా.. చంద్రబాబు సర్కారు ఆయనకు ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర అతిథి స్థాయిలో గౌరవించింది. దీనిపై చంద్రబాబుకు కేంద్రం మరోమారు హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చిందట‌. దలైలామాతో రాష్ట్ర ప్రభుత్వం నెరపుతున్న స్నేహ పూర్వక సంబంధాల విషయంలో కేంద్రం అసహనంగా ఉన్నట్లు సమాచారం.

ఒకవైపు చైనాతో సత్సంబంధాలు నెరపుతూ మరోవైపు చైనాకు గిట్టని దలైలామాను అక్కున చేర్చుకోవడంపై అధికార వర్గాల్లోనే అనేక చర్చలు సాగాయి. ఈ అంశంపై కేంద్రం కూడా ఆరా తీసినట్లు తెలిసింది. చైనాతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుకునే తరుణంలో దలైలామాను అక్కున చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని కేంద్రం నుంచి కొంతమంది రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్లు చెప్తున్నారు. ఇకపై ఇటువంటి చర్యలకు దూరంగా ఉంటే మంచిదని కూడా సున్నితంగా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

బాబు ఆయ‌న‌తో అప్ర‌మ‌త్తం.. కేంద్రం హెచ్చ‌రిక‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share