బావ‌పై హ‌రికృష్ణ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

January 28, 2017 at 10:08 am
Harikrishna

కొంత‌కాలం నుంచి నంద‌మూరి-నారా కుటుంబాల మ‌ధ్య గ్యాప్ ఉన్న విష‌యం తెలిసిందే! ముఖ్యంగా నంద‌మూరి హ‌రికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ త‌న బావ‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసింది లేదు! కానీ తొలిసారి హ‌రికృష్ణ‌.. చంద్ర‌బాబుపై న‌ర్మ‌గ‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వ‌చ్చిందో.. అందుకు గ‌ల కార‌ణాలను ఆయ‌న వివ‌రించారు.

టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్న‌త‌ర్వాత ఎన్టీఆర్‌ రాజకీయ వారసుడిగా తెర ముందుకు వచ్చిన హరికృష్ణ… బాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరు కుంపటి పెట్టేసుకున్నారు. అనంత‌రం ఆయ‌న కూడా బాబు చెంత‌నే చేరారు. పార్టీలో చేరిన నాటి నుంచి ప్రతి విషయంలోనూ ఆయనకు తగిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. ఈ క్రమంలో బహిరంగ సమావేశాల్లోనే పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం, అసంతృప్తిని వ్య‌క్తంచేశారు! దీంతో ఆయ‌న‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసినా… ఆ మాటేదో హరికృష్ణ నోట రాలేదు కానీ తొలిసారి ఈ విష‌యాల‌పై ఆయ‌న స్పందించారు.

ఎన్టీఆర్ తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో ఓ సీసీ రోడ్డుకు తన ఎంపీల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆ రోడ్డును ప్రారంభించాలని గ్రామస్థులు హరికృష్ణను కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించిన హరికృష్ణ నిన్న నరసింహాపురం వెళ్లి సదరు రోడ్డును ప్రారంభించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తాను నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తగిలాయని హరికృష్ణ వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడడంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

 

బావ‌పై హ‌రికృష్ణ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share