బీజేపీ లెక్క‌: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్‌

January 29, 2017 at 5:28 am
AP

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగిందా? నిజానికి హోదా విష‌యంలో ఏపీకి అర్హ‌త లేదా? విభ‌జ‌న‌తో ఎంతో న‌ష్ట‌పోయిన ఏపీకి అర్హ‌త లేదుకాబ‌ట్టే.. ఇంత‌కాలం హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెబుతోందా? అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు హోదా బ‌దులు ప్యాకేజీతో స‌రిపెడ‌తామ‌ని అంటోందా? అంటే.. ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా సోము హోదాపై స్పందించారు. ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా.. ఎదుటివాళ్లు ఏమ‌నుకుంటారు? అని ఎంత‌మాత్రం ఆలోచించ‌కుండా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌తారు. ఈ క్ర‌మంలోనే హోదాపై త‌న‌దైన శైలిలో సోము స్పందించారు.

ఏపీకి హోదా రాద‌ని అన్నారు. వాస్త‌వానికి ఈమాట బీజేపీ వాళ్లు, టీడీపీవాళ్లు సంయుక్తంగా స‌భ‌ను పంచుకుని మ‌రీ చెబుతున్న‌మాటే. అయితే, సోము మ‌రో వ్యాఖ్య చేశారు. హోదా ఇచ్చే అర్హ‌త ఏపీకి లేద‌న్నారు. అంటే.. అర్హ‌త లేదు కాబ‌ట్టే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడుతోంద‌ని డైరెక్ట్‌గా చెప్పేశారు సోము. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. హోదా ఇచ్చేందుకు ఏపీకి అర్హ‌త లేదని, నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా కావాలని తొలుత బీజేపీ మాత్రమే కోరిందని వీర్రాజు గుర్తు చేశారు. ఆనాడు కలిసి రాని పార్టీలు ఇప్పుడు రోడ్డెక్కడం తమ ప్రచారం కోసమేనని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్న ప్రచారం చేస్తున్నారని ఇది నిజం కాదని అన్నారు. హోదా సంజీవని కాదని బాబు డైలాగును అరువు తెచ్చ‌కున్నారు. గతంలో రూపొందించిన నిబంధనలు ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించేందుకు తగిన అర్హతలు లేకపోవడంతోనే కేంద్ర వెనక్కు తగ్గిందని అస‌లు విష‌యం చెప్పారు. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం లేకపోవడంతో రాష్ట్రాన్ని ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిందని వీర్రాజు చెప్పారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వెంక‌య్య అండ్ చంద్ర‌బాబులు చెబుతున్న విధంగా ఆర్థిక సంఘం అడ్డుకుంటోంద‌నే కామెంట్లు స‌రికాద‌న్న‌మాట‌. హోదా ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త‌లు ఏపీకి లేక‌పోవ‌డం వ‌ల్లే కేంద్రం వెన‌క్కి త‌గ్గుతోంద‌ని సోము చెప్పార‌న్న‌మాట‌.

 

బీజేపీ లెక్క‌: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share