మంత్రి పదవి రేసులో ఆశావహుల లిస్ట్ చూస్తే షాకే..

February 21, 2017 at 10:36 am
116

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రిని ఉంచుతారో తెలీదు.. ఎవ‌రి బెర్తు క‌న్ఫార్మ్ అవుతుందో క్లారిటీ లేదు! ఎవ‌రి పోస్టు పీకేస్తారో ఊహ‌ల‌కు అంద‌డం లేదు! పార్టీ అధినేత అనుగ్ర‌హం ఎవ‌రిపై ఉంటుందో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు! కానీ ఆశావ‌హుల జాబితా మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నాన‌ని, త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఒక‌రు… త‌న‌కు చోటు క‌ల్పిస్తే జిల్లాలో సామాజిక అంశాల ప‌రంగా బ‌లం పెరుగుతుంద‌ని మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రి ప్ర‌యత్నాలు వారు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మంత్రి అభ్య‌ర్థుల ఆశావ‌హుల‌ జాబితా పెరిగిపోతోంది.

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని పలువురు ఆశావాహులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదురు చూస్తున్నారు. మార్చి 1వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నాల్లో ముందుండగా పరోక్షంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా ఇదే దోవలో ఉన్నారు. సీఎం చంద్ర‌బాబు తనయుడు లోకేష్‌ను ఆయనను ఎమ్మెల్యేల ఓటింగ్‌ ద్వారా ఎమ్మెల్సీకి ఎన్నిక చేయ‌బోతున్నారు. దీంతో ఎమ్మెల్సీల నుంచి ముగ్గురు ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

వీరు కాక ఎమ్మెల్సీగా ఉన్నవారిలో పలువురు మంత్రులు కావాలని ఆశపడుతున్నారు. కడప జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సతీష్‌కుమార్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. పులివెందుల నుంచి పార్టీ అభ్యర్థిగా పలు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆయన తాను పార్టీ కోసం చాలా త్యాగాలు చేశానని, తనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పార్టీని మెరుగైన స్థితిలో నిలుపుతానని చెబుతూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదని తనకు మంత్రి పదవి ఇస్తే మైనార్టీల్లో పార్టీకి విశ్వాసం పెరుగుతుందని మహ్మద్‌ షరీఫ్‌ చెబుతున్నారు. ఇక సీనియర్‌ మహిళా నాయకురాలు కావలి ప్రతిభా భారతి కూడా తనకు అవకాశం వస్తుందనే విశ్వాసంతో ఉన్నారు.

వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విశాఖ జిల్లాకు చెందిన ఎం.వి.వి.ఎస్‌. మూర్తి, ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి,  అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌, కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా వెంకన్న, గుంటూరు జిల్లాకు చెందిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన టి.డి.జనార్థన్‌లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.ఇక టీడీపీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా పనిచేసిన టి.డి.జనార్థన్‌ కూడా తాను చేసిన సేవలకు మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారట. మ‌రి ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతుంటే.. చంద్ర‌బాబు లెక్క ఎలా ఉందో!!

మంత్రి పదవి రేసులో ఆశావహుల లిస్ట్ చూస్తే షాకే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share