మాట‌లు స‌రే… రియ‌ల్ పాలిటిక్స్ ఎప్పుడు ప‌వ‌న్‌?!

December 21, 2016 at 12:51 pm
pawan Kalayan

ప్ర‌శ్నిస్తాను! అంటూ 2014లో పొలిటిక‌ల్ అరంగేట్రం చేసిన ప‌వ‌న్‌.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ప్ర‌శ్నించ‌క‌.. ప్ర‌శ్నించ‌క.. ప్ర‌శ్నిస్తున్న ప్ర‌శ్న‌లు అంద‌రికీ బోరుకొట్టిస్తున్నాయ‌ట‌!! ఏపీ పాలిటిక్స్‌లో గ‌ట్టి నేత దొరికాడురా దేవుడా అని అనుకుంటున్న జ‌నానికి ఈ ప్ర‌శ్న‌లు, ట్వీట్లు అర్ధం కాక‌.. జుట్టుపీక్కుంటున్నార‌ట‌. వాస్త‌వానికి రాష్ట్రంలో నెట్ వాడేవారు ప‌ట్ట‌ణాల్లోనే అంతంత మాత్రం. ఇక‌, ప‌ల్లెటూళ్ల‌లో ప‌రిస్థితి వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్రమంలో పొలిటిక్ పార్టీల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ చేస్తున్న ట్వీట్ల‌ను ఎంత‌మంది చూస్తున్నారు? ఎంత‌మందికి అవి అర్ధ‌మ‌వుతున్నాయి? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు.. ఇప్పుడు ప‌వ‌న్‌ని జ‌నాలు అడుగుతున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక స‌మ‌స్య‌ల‌పైనా ప‌వ‌న్ పోరాటం చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, కేంద్రం నుంచి నిధుల విష‌యంలో ప‌వ‌న్ విజృంభిస్తాడ‌ని భావించారు. నిజానికి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇటు చంద్ర‌బాబు, అటు న‌రేంద్ర మోడీలు ఏపీ ప్ర‌జ‌ల‌కు హోదాపై హామీ ఇచ్చారు. అయితే, రాజ‌కీయ ప్రాధాన్యాల నేప‌థ్యంలో ఈ హోదాను గ‌ట్టెక్కించారు. అయితే, ఈ విష‌యంలో కేంద్రంతో పోరాడైనా హోదా సాధించే నేత లేక పోవ‌డం ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ఈ నేప‌థ్యంలో హోదాపై ప‌వ‌న్ గ‌ళం విప్ప‌డాన్ని అంద‌రూ స్వాగ‌తించారు.

అయితే, బాధ్య‌త పెరిగిన కొద్దీ… త‌నపై అంచ‌నాలు పెరిగిన కొద్దీ.. ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సిన ప‌వ‌న్.. రానురాను మ‌రింత జోక్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే టాక్ వ‌స్తోంది. ప్ర‌త్యేక హోదాను పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చ‌డాన్ని ఏపీ ప్ర‌జ‌లు స్వాగ‌తించారు. కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న తీసుకున్న డెసిష‌న్లు, ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం, హోదా విష‌యంలో అటు కేంద్రంలోని మోడీ ది ఎంత త‌ప్పు ఉందో.. ఇటు రాష్ట్రంలోని చంద్ర‌బాబుది కూడా అంతే త‌ప్పు ఉన్న విష‌యాన్ని దాచి పెట్టి.. కేవ‌లం కేంద్రంలోని మోడీ, వెంక‌య్య నాయుడ‌ల‌పై విరుచుకుప‌డ‌డంపై కొన్ని వ‌ర్గాల్లో ప‌వ‌న్‌ను చుల‌క‌న చేస్తోంది.

ఇక‌, తాజాగా.. ప‌వ‌న్ చేసిన ట్వీట్లు మ‌రింత‌గా కామెడీగా ఉంటున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. అయినా.. పాలిటిక్స్‌లో ట్వీట్స్‌తో ఎంత‌కాలం నెట్టుకొస్తావ్? అని కూడా ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న‌వాళ్లు ఉన్నారు. ప్ర‌త్య‌క్ష క‌ర్యాచ‌ర‌ణ లోకి రాకుండా ఈ ట్వీట్ల‌తో ఎంత‌కాలం నెట్టుకొస్తావ్‌? అనికూడా అడుగుతున్నారు. మొత్తానికి ప‌వ‌న్‌కి ఇప్పుడు.. త‌న ట్వీట్లే.. త‌న‌కు ఎదురు తిరుగుతున్న‌ట్టు ఉంది. ఇప్పుడు ప్ర‌జ‌లంతా ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి రావాల‌ని ప‌వ‌న్ కోరుతున్నారు.

విప‌క్ష నేత జ‌గ‌న్ కూడా కొన్నాళ్ల కింద ట్విట్ట‌ర్ ఖాతా ఓపెన్ చేశార‌ని, అయితే, దానికి అంతంత మాత్రం ఆద‌ర‌ణ ఉంద‌ని గ్ర‌హించి.. ఇప్పుడు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండేలా ఏదో ఒక కార్య‌క్ర‌మం ఎంచుకుంటున్నార‌ని అంటున్నారు. అదేవిధంగా ప‌వ‌న్ కూడా ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు పూనుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ దీనికి ప్ర‌త్య‌క్షంగా బ‌దులిస్తాడో? లేక ట్వీట్ చేస్తాడో చూడాలి!

 

మాట‌లు స‌రే… రియ‌ల్ పాలిటిక్స్ ఎప్పుడు ప‌వ‌న్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share