మాస్టారి విష‌యంలో కేసీఆర్ అట్ట‌ర్‌ ప్లాప్

February 24, 2017 at 10:46 am
KCR

తెలంగాణ‌లో త‌న‌కు ఎదురు నిలిచే నాయ‌కుడే లేకుండా చేసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను.. ఒక ప్రొఫెస‌ర్‌ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు! త‌న వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌కు చిత్తు చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి పాచిక‌లు.. ఆయ‌న ముందు మాత్రం క‌ద‌లడం లేదు!! ఎంతో ఉద్ధండుల‌ను సామ‌దాన బేధ దండోపాయాల‌తో త‌న అక్కున చేర్చుకున్న తెలంగాణ చంద్రుడి వ్యూహాలు.. కోదండాస్త్రం ముందు బెడిసికొడుత‌న్నాయి. కేసీఆర్‌ను ఇప్పుడు ఇంతలా ఇబ్బంది పెడుతున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం!! ఎంతో మంది నాయ‌కుల‌ను త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్‌.. కోదండ‌రాంని మాత్రం దారికి తెచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారనే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రాజ‌కీయ శ‌క్తుల‌ను ఐక్యం చేస్తే.. మిగిలిన వ‌ర్గాల‌న్నింటినీ ఏక‌తాటిపై న‌డిపిన వ్య‌క్తి టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం. ఉద్య‌మ స‌మ‌యంలో బండికి గ‌ల రెండు చ‌క్రాలుగా ఉన్న వీరు.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న త‌ర్వాత.. వీరి మార్గాలు వేర‌య్యాయి. ప్ర‌స్తుతం కోదండ‌రాం.. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న చేప‌ట్టిన దీక్ష ర‌సాభాస‌గా మారింది. ఆయ‌న్ను అరెస్టు చేసే స్థాయికి చేర‌డంతో ఇక ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం రెట్టింప‌యింది. దీంతో కేసీఆర్‌పై తెరాస నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

రాష్ట్రం ఏర్ప‌డ్డాక రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు కోదండ‌రామ్ నిరాక‌రించారు. ప్ర‌జ‌ల ప‌క్షానే ఉంటానంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. నిజానికి, అప్ప‌టి నుంచే ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెట్టారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ప్రాజెక్టు ప్రాంతాల్లో నిర్వాసితుల క‌ష్టాలు.. వీటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బాగానే కృషి చేశారు. అయితే, ఎప్పుడైతే కోదండ‌రామ్ వాయిస్‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌స్తోంద‌ని గ్ర‌హించారో… అప్ప‌ట్నుంచీ తెరాస నేత‌లు కూడా కోదండ‌రామ్‌పై మాట‌ల దాడి మొద‌లుపెట్టారు.

తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌ని నాయ‌కులు, టీఆర్ఎస్‌ను తీవ్రంగా విమర్శంచే నాయ‌కులను కూడా కేసీఆర్ వెన‌కే ఉంటున్నారు. మ‌రి ఇంత‌మందిని ఎట్రాక్ట్ చేసిన కేసీఆర్‌.. కోదండ‌రామ్‌ను ఎందుకు ఆక‌ర్షించ‌లేక‌పోయారు..? త‌న‌వైపు ఎందుకు తిప్పుకోలేక‌పోయారు..? ఆయ‌న విష‌యంలో కేసీఆర్ రాజ‌కీయ చ‌తుర‌త వ‌ర్కౌట్ కాలేదా..? లేదంటే, ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌డంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారా..? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశాలుగా మారుతున్నాయి.

 

మాస్టారి విష‌యంలో కేసీఆర్ అట్ట‌ర్‌ ప్లాప్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share