మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..

February 18, 2017 at 10:16 am
KCR

విభ‌జ‌న‌తో 16వేల కోట్ల‌ తీవ్ర లోటు బ‌డ్జెట్‌తో ఏపీ త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ఇప్ప‌టికీ ఆ న‌ష్టం కొన‌సాగుతూనే ఉంది. దీంతో అప్పు ఇచ్చే వారి కోసం ఏపీ ఎదురుచూస్తుంటే ఇప్పుడు తెలంగాణ ప‌రిస్థితి కూడా ఇలానే మారింద‌ట‌. మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ సాధ‌న వైపు అడుగులేస్తోంద‌ని నాయ‌కులు ఊద‌ర‌గొడుతున్నారు. అయితే ఇదంతా కేవ‌లం ఆ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌చారమేన‌ట‌. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోంద‌ట‌. ఈ మూడేళ్ల‌లోనే ల‌క్ష కోట్ల అప్పులు చేసిందంటే ఊహ‌కి అంద‌ని విష‌య‌మేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రానున్న రెండేళ్ల‌లో ఈ అప్పులు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు.

బంగారు తెలంగాణ క‌ల సాకార‌మ‌వుతోంద‌ని ఒక ప‌క్క తెలంగాణ ప్ర‌జ‌లు, నాయకులు సంతోష‌ప‌డుతుంటే.. తెలంగాణలోని వాస్త‌వ‌ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న ఆర్థిక వేత్త‌లు మాత్రం తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విశ్వ‌న‌గ‌ర విస్త‌ర‌ణ, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు పారిశ్రామికాభివృద్ధి ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నా.. మ‌రోప‌క్క రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయ ప‌రిస్థితిలో ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. తెలంగాణ నానాటికీ అప్పుల సుడిగుండంలో చిక్కుకుంటోంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. కేసీఆర్ స‌ర్కారు ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతోంద‌ట‌.

ఈ ఏడాది ఇప్పటికే రూ. 21 వేల కోట్లు కొత్త అప్పులు తెచ్చేసిందట‌! అధికారంలోకి వ‌చ్చిన తొలి సంవ‌త్స‌రం రూ. 10 వేల కోట్లు.. ఆ త‌రువాతి ఏడాది మ‌రో రూ. 16 వేల కోట్ల‌ను రుణాలుగా తీసుకొచ్చింద‌ట‌. మొత్తంగా ఈ మూడేళ్ల‌లో దాదాపు ల‌క్ష కోట్ల అప్పుల్ని దాటేసింది! భ‌విష్య‌త్తులో ఆదాయం అద్భుతంగా ఉంటుంద‌నే ఉద్దేశంతోనే ఇప్పుడు అప్పులు చేస్తున్నాం అని చెబుతున్నా.. వాస్త‌వంలో తెలంగాణ ఆదాయం గ‌ణ‌నీయంగా పెరిగిందేం లేదని ఆర్థిక నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. వ‌స్తున్న ఆదాయంలో చాలా వ‌ర‌కూ వ‌డ్డీలు చెల్లించ‌డానికే స‌రిపోతున్నాయ‌ట‌.

మిష‌న్ భ‌గీర‌థ‌, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చేసిన భారీ అప్పుల వ‌ల్ల అంతిమంగా భారం ప‌డేది సామాన్యుడి పైనే అని చెబుతున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై నియంత్రణ‌ కోల్పోయే దిశ‌గా రాష్ట్రం ప‌య‌నిస్తోంద‌న్న‌ది నిపుణుల ఆందోళ‌న‌. నోట్ల ర‌ద్దు కార‌ణంగా పారిశ్రామిక ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింద‌ని అభిప్రాయ ప‌డుతు న్నారు. మ‌రి గుజ‌రాత్‌తో పోటీప‌డుతున్న‌తెలంగాణ ఇలా అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ అప్పుల కోసం ఇలా అప్పుల్లో చిక్కుకుపోవ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే!! మరి రానున్న రెండేళ్ల‌లో ప‌రిస్థితులు ఇంకెలా ఉంటాయో వేచిచూడాల్సిందే!!

 

మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share