మోత్కుపల్లికి ఫేవర్ గా చక్రం బాగానే తిప్పారు కానీ !

February 4, 2017 at 5:40 am
31

టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఆశ‌లు ఇప్ప‌ట్లో ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఎన్నాళ్లుగానో ఈ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకే క్రియాశీల రాజ‌కీయాల‌కు కూడా చాలా దూరంగా ఉండి చానాళ్ల‌యింది. తెలంగాణ‌లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా టీడీపీ పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్య‌మం, ప్రాజ‌క్టుల పోరు వంటివి చేప‌ట్టినా మోత్కుప‌ల్లి మౌనంగానే ఉండి పోయారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలోనే త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఖాయ‌మ‌ని ఆయ‌న అనుకున్నారు. అయితే, ఇప్ప‌ట్లో ఆయ‌న‌కు ఆ క‌ల ఫలించేలా క‌నిపించ‌డం లేదు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మోత్కుప‌ల్లికి ఫేవ‌ర్‌గా చ‌క్రం బాగానే తిప్పారని తెలుగు త‌మ్ముళ్లు చెబుతుంటారు. ద‌ళిత వ‌ర్గానికి చెందిన మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీ వంటి పెద్ద ప‌ద‌విని ఇప్పించ‌డం ద్వారా చంద్ర‌బాబు ఆ వ‌ర్గానికి చేరువ అవ‌డం ఖాయ‌మ‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో త‌న‌కు మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి విష‌యం కేంద్రానికి బాగానే సిఫార‌సు చేశారు. ఈ క్ర‌మంలోనే మొన్నామ‌ధ్య కేంద్ర హోం శాఖ సైతం మోత్కుప‌ల్లి.. బ‌యోడేటాను కూపీ లాగింద‌ని, ఆయ‌న బిహేవియ‌ర్‌, పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ వంటి వాటిని హోం వ‌ర్గాలు సేక‌రించాయ‌ని కూడా మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌చ్చాయి.

దీంతో మోత్కుప‌ల్లి త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఖాయ‌మ‌ని అనుకున్నారు. ఇక్క‌డే ఆయ‌న‌కు మ‌రింత ఆశ‌లు రేకెత్తించేలా.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇంకేముంది ప‌క్క‌రాష్ట్రంలోనే మోత్కుప‌ల్లి పెద్ద హోదాలో కూర్చోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ వ‌ర్గాలు భావించాయి. అయితే, అనూహ్యంగా ఇది కూడా ఆశ‌లు గ‌ల్లంతులు చేసింది. దీంతో ఇప్పుడు అస‌లు మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీ వ‌స్తుందా?  రాదా? అన్న‌ది పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదే విష‌యంపై ఇటీవ‌ల చంద్ర‌బాబు సైతం త‌న మ‌న‌సులో మాట‌ను నేరుగా మోత్కుప‌ల్లితోనే అన్నార‌ట‌. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశాన‌ని, అయినా కూడా కొంత కాలం వెయిట్ చేయాల‌ని సూచించార‌ట‌. దీంతో మోత్కుప‌ల్లి మౌనంగా ఉండ‌డం త‌ప్ప ఏమీ అన‌లేక‌పోయార‌ని తెలిసింది. ఇప్ప‌టికైతే.. మోత్కుప‌ల్లి ఆశ‌లు గ‌ల్లంతేన‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు! మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

మోత్కుపల్లికి ఫేవర్ గా చక్రం బాగానే తిప్పారు కానీ !
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share