యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం

February 16, 2017 at 6:41 am
add_text

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నిక‌లు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తికి చావోరేవోగా మారాయి. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు జోరు చూపిస్తుంటే…మోడీ నేతృత్వంలోని బీజేపీ కూడా అధికారం త‌మ‌దే అని ఆరాట‌ప‌డుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య‌లో బీఎస్పీ సైతం పోటీకి సైసై అంటోంది. ఈ ఎన్నిక‌లు బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్య‌గా మారాయి.

ఎలాగైనా గెలిచేందుకు మాయావ‌తి స‌రికొత్త వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళితుల పార్టీగా ముద్ర‌ప‌డిన బీఎస్పీని అన్ని వ‌ర్గాల ద‌గ్గ‌ర చేసేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తున్న మాయావతి పార్టీ 99 మంది ముస్లింలు, 87 మంది దళితులకు టికెట్లిచ్చారు. 113 మంది అగ్రవర్ణాల అభ్యర్థులకు ఛాన్సిచ్చారు. వాళ్లలో 66 మంది బ్రహ్మణులు, 11 మంది ఠాకూర్లు. ఇక అత్యధికంగా ముస్లింలకు సీట్లను కట్టబెట్టడం … ముస్లిం ఓట్లకు గురిపెట్టడమే అని విశ్లేషిస్తున్నారు నిపుణులు.

యూపీలో 130 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లింలు గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యిస్తున్నారు. అందుకే మాయ ముస్లిం ఓట్ల‌పై గురి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మాయ‌కు 2009, 2014 ఈ రెండు లోక్‌స‌భ ఎన్నిక‌లు నిరాశ‌ను మిగిల్చాయి. 2014లో అయితే బీఎస్పీ ఒక్క ఎంపీ సీటు కూడా గెల‌వ‌లేదు. అప్ప‌టి నుంచి ఆమె పార్టీని బ‌లోపేతం చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. బాయిచార సమ్మేళనం పేరుతో అన్ని కులాలను ఏకతాటిపై తీసుకురావాలని ప్రయత్నించారు.

బీఎస్పీ గ‌త చ‌రిత్ర చూస్తే 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 23.9 శాతం ఓట్లతో 98 స్థానాల్లో గెలిచింది. 2007 ఎన్నికల్లో 30.4 శాతం ఓట్లతో 206 సీట్లు గెలుచుకుని … సోలోగా సీఎం పీఠం దక్కించుకున్నారు. 2012లో మాత్రం 25.9 శాతం ఓట్లతో 90 స్థానాలకు పరిమితమైంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 20 శాతం ఓట్లు ఉన్న ద‌ళితులు ఓట్లు గంప‌గుత్త‌గా ప‌డ‌తాయ‌న్న ఆశ‌తో మాయ ఉన్నారు. ఓవ‌రాల్‌గా ముస్లిం+ద‌ళిత్ ఓటు బ్యాంకు మాయ‌కు క‌లిసొస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నా ? అది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share