రాహుల్‌కి చెక్ పెడుతున్న దీదీ!

December 11, 2016 at 6:28 am
Rahul Gandhi

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏ అవ‌కాశం వ‌చ్చినా.. అందిపుచ్చుకోవాలి. ఆ అవ‌కాశాన్ని త‌మ ఎదుగుద‌ల‌కు సోపానంగా మ‌లుచుకోవాలి. అప్పుడే జ‌నాల్లో ఆ పార్టీ ప‌ట్లా.. నేత‌ల ప‌ట్లా ఆద‌ర‌ణ పెరిగేది. అధికార ప‌క్షం చేసే త‌ప్పుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేదే అస‌లు సిస‌లైన విప‌క్షం. ఈ విష‌యంలో ఎందుకోగానీ ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో ఈ పార్టీని వెన‌క్కి నెడుతూ.. అంద‌రూ దీదీగా పిలుచుకునే ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ని వెన‌క్కి నెడుతున్నారు. మ‌రి ఆ విష‌యం ఏంటో చూద్దాం..

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దుతో ఆర్ధిక వ్య‌వ‌స్థలో పెను కుదుపు చోటు చేసుకుంది. న‌వంబ‌రు 8 న హ‌ఠాత్తుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ‌వ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ… సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప‌రిణామంతో దేశంలోని న‌ల్ల‌కుబేరుల‌కు ముకుతాడు ప‌డుతుంద‌ని, దేశం అభివృద్ధిలో ముందుకు ప‌రుగు పెడుతుంద‌ని ప్ర‌ధాని స‌హా అధికార పార్టీ, కూట‌మి పార్టీల నేత‌లు ప్ర‌క‌టించారు. ఇక‌, పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఏర్ప‌డిన చిల్ల‌ర కొర‌త కూడా ఎక్కువ కాలం ఉండ‌బోద‌ని అంద‌రూ ప్ర‌క‌టించారు. బ్యాంకుల వ‌ద్ద‌, ఏటీఎంల వ‌ద్ద పెద్ద ఎత్తున క్యూలు త్వ‌ర‌లోనే స‌మ‌సిపోతాయ‌ని అన్నారు.

అయితే, పైకి ప్ర‌క‌టించిన విధంగా ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. బ్యాంకుల వ‌ద్ద క్యూలు నెల రోజులు గ‌డిచినా క‌నిపిస్తూనే ఉన్నాయి. ఈ ప‌రిణామంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఈ విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో వెనుక‌బ‌డింద‌నే వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనారోగ్యంతో ఉండ‌డంతో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఉద్య‌మం చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న వెనుక‌బ‌డ్డారు. అంతేకాదు, మోడీ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించారు.

అదేస‌మ‌యంలో ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఫస్ట్ డే నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఆమె.. మోడీపై దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు పెద్ద నోట్ల నిర్ణ‌యాన్ని మూడు రోజుల్లోనే వెన‌క్కి తీసుకోవాల‌ని అప్ప‌ట్లోనే అల్టిమేట‌మ్ కూడా జారీ చేశారు. ఇక‌, వివిధ రాష్ట్రాల‌కు వ‌చ్చి మోడీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌డుతున్నారు. సో.. దీంతో రాహుల్ చేయాల్సిన ప‌నిని దీదీ చేస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది. ఇది పొలిటిక‌ల్‌గా రాహుల్‌కు దెబ్బ అనేది విశ్లేష‌కుల మాట‌.

 

రాహుల్‌కి చెక్ పెడుతున్న దీదీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share