రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవ‌రు..?

December 30, 2016 at 7:14 am
Revanth Reddy

తెలంగాణ‌లో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీల‌న్ని కూడా అక్క‌డ ప్ర‌తిప‌క్షాలుగానే ఉన్నాయి. ఇక్క‌డ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్ర‌తిప‌క్ష నేత‌లు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి విసిరే పంచ్‌ల‌కు ఉండే క్రేజే వేరు.

తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఇప్పుడు ఆ పార్టీకి కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలారు. వీరిలో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్య మాత్ర‌మే యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండ‌గా ఆర్‌.కృష్ణ‌య్య పార్టీలో ఉన్నారో లేదో కూడా ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు.

ఇక తెలంగాణ‌లో టీడీపీకి ఫ్యూచ‌ర్ లేద‌న్న టాక్ వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే రేవంత్ పార్టీ మార‌తార‌ని కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రేవంత్ ముందుగా కాంగ్రెస్‌లోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత బీజేపీ పేరు కూడా వినిపించింది. అయితే ఈ రెండు పార్టీలు కూడా రేవంత్‌ను త‌మ పార్టీల్లోకి చేర్చుకునేందుకు సుముఖంగా లేవ‌ని..అందుకే రేవంత్ ఇంకా టీడీపీనే ప‌ట్టుకుని వేలాడుతున్నాడ‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.

వాస్త‌వానికి తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేసేందుకు స్కెచ్ వేసిన అమిత్ షా రేవంత్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చి త‌మ పార్టీలోకి తీసుకోవాల‌ని ప్లాన్ వేశార‌ట‌. ఇక కాంగ్రెస్ కూడా రేవంత్ వైపు చూసింది. రేవంత్‌రెడ్డిని తీసుకుని కేసీఆర్‌పై బ‌ల‌మైన ఆయుధంగా ప్రయోగించొచ్చు. రేవంత్ మామ జైపాల్‌రెడ్డి రంగంలోకి దిగితే రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ క్ష‌ణాల్లో జ‌రుగుతోంది.

అయితే ఇప్పుడు రేవంత్‌ను త‌మ పార్టీల్లోకి తీసుకోవ‌డంలో బీజేపీ-కాంగ్రెస్ వెనుకాడ‌డం వెన‌క రేవంత్ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. రేవంత్‌ను త‌మ పార్టీల్లోకి తీసుకుంటే ఆ మ‌ర‌క త‌మ‌కు పెద్ద మైన‌స్‌గా మారుతుంద‌ని ఆ పార్టీలు భావిస్తున్నాయ‌. దీంతో రేవంత్‌కు ప్ర‌స్తుతం టీడీపీ మాత్ర‌మే పెద్ద దిక్కుగా క‌నిపిస్తోంది. మ‌రి రేవంత్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీని తెలంగాణ‌లో త‌న భుజ‌స్కంధాల మీద వేసుకుని న‌డిపిస్తాడో లేదా అప్ప‌ట‌కి త‌న దారి తాను చూసుకుంటాడా ? అన్న‌ది చూడాలి.

 

రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవ‌రు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share