వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!

February 1, 2017 at 6:32 am
3

ఇంకా రెండేళ్లు ఉండ‌గానే వైసీపీలో టికెట్ల ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే ఈ ర‌చ్చ ప్రారంభ‌మైంది. కాపు ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తారనే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా త‌న‌కే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని భావించిన సునీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం!

ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం, జ‌గ‌న్ మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు! అంతేగాక 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌నే ప్ర‌చారం కూడా ఈ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపులు అధికంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాకినాడ ఎంపీగా పోటీచేయాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఇదే అభిప్రాయాన్ని జ‌గ‌న్ ముందుంచ‌గా.. అందుకు ఆయ‌న కూడా ఓకే అన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కూడా కుదిరింద‌ట‌.

కాకినాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నారై చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌ రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాకినాడ నుంచి ప్ర‌జారాజ్యం త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీ కావాల‌ని భావిస్తున్నారు! అయితే ముద్ర‌గ‌డ ఎంట్రీ గురించి సునీల్‌కు జ‌గ‌న్ చెప్పార‌ట‌! ముద్ర‌గ‌డ అంత‌టి బ‌ల‌మైన కాపు నేత‌ ఆ సీటు అడిగితే.. ఆయ‌నకు త‌ప్ప వేరొక‌రికి ఈ సీటు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెప్పేశార‌ట.

కాకినాడ ఎంపీ సీటుకు బ‌దులుగా పిఠాపురం లేదా మ‌రెక్క‌డైనా ఎమ్మెల్యే సీటు ఇస్తాన‌ని జ‌గ‌న్‌ చెప్పార‌ట‌. ఈ నిర్ణ‌యంపై సునీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం! తన‌కు ఎంపీ అవ్వాల‌నే ధ్యేయ‌మ‌ని..అందుకోస‌మే గ‌త ప‌దేళ్లుగా ఇక్క‌డ ప‌ని చేసుకుంటున్నాన‌ని.. ఇప్పుడు త‌న‌ను ఇలా త‌ప్పించ‌డం ఏంట‌ని ఆయ‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌

వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share