వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!

February 6, 2017 at 5:54 am
33

వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న క‌డ‌ప‌లో టీడీపీ సైకిల్ ప‌రుగులు పెట్టించాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న చంద్ర‌బాబు అండ్ కో క‌ల‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఈ జిల్లా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం శ‌త‌థా శ్ర‌మిస్తున్నప్ప‌టికీ.. బాబు ప‌క్షాన నిల‌బ‌డే వాళ్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదనే ప‌రిస్థితి తాజా ప‌రిణామాల‌తో స్ప‌ష్ట‌మైంది! జ‌గ‌న్ ఇలాకాగా పేరు ప‌డ్డ క‌డ‌ప‌లో వైకాపా అడ్ర‌స్ లేకుండా చేద్దామ‌ని చంద్ర‌బాబు య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌కు తోడుగా ఆయ‌న అనుచ‌రులు క‌డ‌ప టీడీపీ నేత‌లు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రేపో మాపో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను వాళ్లు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావించారు.

ముఖ్యంగా క‌డ‌ప నుంచి ఎమ్మెల్సీగా బ‌రిలోకి దిగుతున్న జ‌గ‌న్ బాబాయి వివేకాను మ‌ట్టి క‌రిపించ‌డం ద్వారా సైకిల్ ప‌వ‌ర్ చూపించాల‌ని బాబు ప్లాన్ వేశారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌దీశారు. ఈ క్ర‌మంలో వైకాపాకు చెందిన కొంద‌రు నేత‌లు క్యూక‌ట్టి మ‌రీ బాబు పార్టీలోకి జంప్ చేశారు. దీంతో విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ప‌రిణామం నిజంగా జ‌గ‌న్‌కి చావు దెబ్బేన‌ని భావించారు. దీనికితోడు సాగునీటి ప్రాజెక్టుల‌ను బాబు వ‌రుస పెట్టి ప్రారంభించేశారు. దీంతో ఇక‌, జ‌గ‌న్ ఇలాకాలో వైకాపా బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌ని అనుకున్నారు.

ఈ ప‌రిణామాల‌ను సైలెంట్‌గా గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. అనూహ్యంగా త‌న జిల్లాలో ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. అటు టీడీపీని కానీ, ఆ పార్టీ నాయ‌కుల‌ను కానీ ప‌న్నెత్తు మాట అన‌కుండా త‌న జిల్లాలో అడుగు పెట్టారు. అంతే! వ‌ర‌ద ప్ర‌వాహం మాదిరిగా జ‌గ‌న్ వెంట జ‌నం ప‌రుగులు తీశారు. అంతేకాదు, మొన్నామ‌ధ్య జంప్ చేసిన వైకాపా నేత‌లు స‌హా కొంద‌రు టీడీపీ త‌మ్ముళ్లు కూడా జ‌గ‌న్ పంచ‌న చేరిపోయార‌ట‌! ఇప్పుడు ఈ విష‌యం క‌డ‌ప‌లో పెద్ద హాట్ టాపిక్‌లా మారింది. బాబు ఒక‌టి త‌లిస్తే.. జ‌నం మ‌రొక‌టి త‌ల‌చార‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ బాబాయి వివేకా… గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అనుకుంటున్నారు. ఏదేమైనా.. బాబు వ్యూహం వైఎస్ ఇలాకాలో సాగ‌బోద‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేశార‌నే మాట విన‌బ‌డుతోంది. మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనా…అక్కడ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share