శ‌శి టార్చ‌ర్ దెబ్బ‌తో ఢిల్లీకి ప‌న్నీర్ సెల్వం

December 19, 2016 at 10:37 am
Pannir selvam

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఢిల్లీ బాట ప‌డుతున్నాయా? త‌మిళనాడు అధికార పార్టీలో ఢిల్లీ జోక్యం పెరగ‌బోతోందా? ఏనాడూ ఢిల్లీ గ‌డ‌ప తొక్క‌ని జ‌య పార్టీ.. నేత‌లు ఇప్పుడు అమ్మ అస్త‌మ‌య‌మైన ప‌ది రోజుల్లోనే ఢిల్లీని శ‌ర‌ణు జొచ్చుతున్నారా? అంటే ఔన‌నే మాటే వినిపిస్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అమ్మ‌కు ఆత్మ బంధువు ప‌న్నీర్ సెల్వం ఇప్పుడు ఢిల్లీ బాట ప‌ట్టారు. విష‌యం ఏంట‌నేది పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. అధికార అన్నాడీఎంకేలో జ‌రుగుతున్న సీఎం సీటు పోరు నేప‌థ్యంలోనే సెల్వం ఢిల్లీకి ప‌య‌న మ‌య్యార‌ని తెలుస్తోంది.

అమ్మ అస్త‌మ‌యం త‌ర్వాత సీఎం పీఠాన్ని ప‌న్నీర్ చేప‌ట్టారు. అయితే, దీనిపై క‌న్నేసిన అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్‌.. ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామ‌ని రెడీ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె.. అత్యంత వేగంగా పావులు క‌దుపుతున్నారు. త‌న కోరిక‌ను ఇప్పుడే తీర్చుకోక‌పోతే.. ప‌న్నీర్ ఆ సీటులో కుదురుకుంటాడ‌ని, అమ్మ‌లేని లోటు లేకుండా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతాడ‌ని ఆమె భావించారు.

దీంతో ఉన్న‌ప‌ళాన మొన్న‌టి వ‌రకు శ‌శిక‌ళ‌ను వ్య‌తిరేకించిన వారితో స‌హా అంద‌రూ ఆమెవైపు మొగ్గేలా పోయెస్ గార్డెన్ నుంచే శ‌శిక‌ళ చ‌క్రం తిప్పారు. దీంతో ఇప్పుడు అన్నాడీఎంకే మంత్రులు స‌హా ఎమ్మెల్యేలు అమ్మ‌సీటులో శ‌శిక‌ళ‌మ్మ కూర్చోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప‌రిణామంతో ఉలిక్కిప‌డ్డ సీఎం ప‌న్నీర్.. త‌న సీటుకు ఎస‌రు ఖాయ‌మ‌ని గుర్తించారు. దీంతో త‌న క‌న్నీర్‌ను తుడిచేసి, ఓదార్చేదీ, ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేదీ ఒక్క న‌రేంద్ర మోడీ త‌ప్ప‌.. మ‌రెవ‌రూ లేర‌ని నిర్ణ‌యించుకుని, ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌న్నీర్ హుటాహుటిన ఢిల్లీ విమానం ఎక్కార‌ని అంటున్నారు.

శ‌శిక‌ళ నుంచి త‌న సీటుకు ఎలాంటి ప్ర‌మాదం లేకుండా, త‌న సీటును ప‌దిలంగా మార్చుకునేలా ప‌న్నీర్ పీఎంతో చ‌ర్చించ‌నున్నార‌ని, మోడీ సాయంతో శ‌శి పెడుతున్న సీటు టార్చ‌ర్‌ను వ‌దిలించుకోవాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇప్ప‌టికైతే.. శ‌శిక‌ళ‌దే పైచేయిగా క‌నిపిస్తోంది.

 

శ‌శి టార్చ‌ర్ దెబ్బ‌తో ఢిల్లీకి ప‌న్నీర్ సెల్వం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share