హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ

February 22, 2017 at 12:41 pm

తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేక‌పోయినందుకు ఒక‌ప‌క్క హైక‌మాండ్ తీవ్ర మ‌థ‌న‌ప‌డుతుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి కొంత‌వ‌ర‌కైనా స్వాంత‌న చేకూర్చాల‌నే అభిప్రాయం ఏ ఒక్క‌రిలోనూ క‌నిపించ‌డంలేదు. ఆధిప‌త్య పోరుతో నాయ‌కులు.. ఒక‌డుగు ముందుకు వంద‌డుగులు వెనక్కి వేస్తున్నారు. క‌ల‌సిక‌ట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డం మాని,,ఎవరికి వారు త‌మ స్వలాభాన్ని చూసుకుంట‌న్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది. దీంతో ఈవ్య‌వ‌హారం ఢిల్లీ పెద్ద‌ల వ‌ర‌కూ వెళ్లింద‌ట‌.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం ద‌క్కుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తాను సీక్రెట్‌గా స‌ర్వే నిర్వ‌హించాన‌ని ఇటీవ‌ల ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. అలాగే కొమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి చెందిన న‌ల్గొండ జిల్లాలోని భువ‌న‌గిరి, న‌క్రీక‌ల్‌లో పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని, అక్క‌డ గెలిచే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. దీంతో కోమ‌టిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గుర‌య్యార‌ని స‌మాచారం. అయితే, ఈ స‌ర్వే ద్వారా త‌న అవ‌కాశాల‌ను దెబ్బ‌తిసేందుకు ఉత్త‌మ్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ కోమ‌టిరెడ్డి ఫీలైపోతున్నారట‌!

న‌ల్గొండ జిల్లాలోని భువ‌న‌గిరి, న‌క్రీక‌ల్ లో త‌న ప్రాంతం కాబ‌ట్టి, ఉద్దేశ‌పూర్వ‌కంగానే అలాంటి నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చార‌న్న‌ది కోమ‌టిరెడ్డి వ‌ర్గం ఆవేద‌న‌! ఈ పంచాయితీ నేరుగా పార్టీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. దిగ్విజయ్ సింగ్‌ను క‌లుసుకున్న కోమ‌టిరెడ్డి ఈ విష‌యాల‌ను వివ‌రించార‌ట‌! ఉత్త‌మ్ నేతృత్వంలో పార్టీ ఓట‌మి పాలౌతూ వ‌స్తోంద‌నీ, ప‌రిస్థితి ఇప్ప‌టికీ మారేలా లేద‌ని అన్నారు. ఉత్త‌మ్‌ను పీసీసీ అధ్య‌క్ష పీఠం నుంచి తొల‌గిస్తే త‌ప్ప, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశార‌ట‌!

పీసీసీ పీఠాన్ని త‌న‌కు ఇవ్వాలంటూ గ‌తంలో ఓపెన్‌ గానే కోమ‌టిరెడ్డి అడిగిన సంద‌ర్భ‌మూ ఉంది. త‌న‌కు పీసీసీ ఇస్తే… రాష్ట్రమంతా ప‌ర్య‌టించి పార్టీ అధికారంలోకి తెచ్చి, సోనియా రుణం తీర్చుకుంటామ‌ని గ‌తంలో అన్నారు. ఇటీవ‌ల తాను ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయ‌మ‌ని చెప్పిన కూడా మ‌రిచిపోలేం. మొత్తానికి, ముఖ్య‌మంత్రి పీఠంతోపాటు పీసీసీ కుర్చీ కూడా త‌న‌కే కావాల‌న్న‌ట్టుగా కోమ‌టిరెడ్డి వైఖ‌రికి ఉంది. మ‌రి, హైక‌మాండ్ ఈ వ్య‌వ‌హారాన్ని ఎలా స‌రిదిద్దుతుందో చూడాల్సిందే!!

 

హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share