హోదాను ప్ర‌జ‌ల‌కు చేర‌నివ్వ‌ని మీడియా

January 29, 2017 at 7:00 am
AP

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఉవ్వెత్తున ఎగిసిన‌ తెలంగాణ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి గ్రామ‌గ్రామాన స్ఫూర్తి ని ర‌గిలించ‌డంలో దిన‌ప‌త్రిక‌లు ప్ర‌ధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచాయి! అలాగే త‌మిళులు జ‌ల్లిక‌ట్టుపై తెలిపిన నిర‌స‌న‌ను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాల‌ని పోరాడుతున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం మీడియా స‌పోర్ట్ ఉండ‌టం లేదా? భావోద్వేగాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌కుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొంద‌రు పాత్రికేయులు!! ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు హోదాకు మ‌ధ్య మీడియా ల‌క్ష్మ‌ణ రేఖ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నేది వారి అభిప్రాయం!!

ప్రజాభిప్రాయానికి తగ్గట్లే మీడియా తన వాదనను వినిపిస్తుంది. కానీ.. ఏపీలోని ప్రింట్ మీడియా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏపీకి హోదా కావాల‌ని గళం విప్పుతున్న ప్ర‌జ‌ల‌కు అధికార పార్టీతో పాటు మీడియా కూడా అండ‌గా నిల‌వ‌డం లేద‌ట‌. అగ్రశ్రేణి దినపత్రికలు కొన్ని సాదాసీదాగా వార్తలు అచ్చేయటం ఇప్పుడు చర్చగా మారింది. ఈ విష‌యంపై ప్రముఖ మీడియా సంస్థల్లోని పనిచేస్తున్న పాత్రికేయులతో ఆసక్తికర విషయాలు బ‌య‌ట‌పెట్టారు.

హోదాకు సంబంధించిన వార్తలు వస్తే.. వాటికిచ్చే ప్రాధాన్యతను వీలైనంతగా తగ్గించాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. హోదాకు అనుకూలంగా విపక్ష నేతతో పాటు.. ఎవరైనా ఉద్యమకారులకు సంబంధించిన వార్తల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారట. భావోద్వేగ తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం వార్తల్లో పెద్దగా కనిపించకూడదని.. నేతలు చేస్తున్న హడావుడికి తగ్గట్లుగా ప్రజల్లో స్పందన లేదన్నట్లుగా వార్తలు ఉండాలన్న సూచనలిస్తున్నార‌ట‌.

అదే సమయంలో.. జగన్.. పవన్ లాంటి వారు హోదా గురించి మాట్లాడిన వార్తలకు సంబంధించిన ట్రీట్ మెంట్ విషయంలోనూ జాగ్రత్తలు చెప్పటం.. వార్త సైజు దగ్గర నుంచి.. వాటి ప్లేస్ మెంట్ వరకూ అన్నింట్లోనూ టోన్ డౌన్ చేయాలన్న మాటను ఓపెన్ గా చెప్పేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. రిపోర్టర్ పంపిన వార్తను వీలైతే పెంచాలని.. లేనిపక్షంలో ఒకట్రెండు లైన్లకు మించి తగ్గితే ఆ వార్త దిద్దిన వారు బాధ్యత వహించాలని చెప్పేవార‌ట‌. మ‌రి హోదా విష‌యంలో ప్ర‌జాభిప్రాయాన్ని ఇలా తొక్కేయ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేమిటో!!

 

హోదాను ప్ర‌జ‌ల‌కు చేర‌నివ్వ‌ని మీడియా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share