అటు కేసీఆర్.. ఇటు కోదండరాం.. డైలమాలో దేవీ ప్రసాద్!

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో వందల మంది ఉద్యోగుల‌ను ఒక్క‌మాట‌తో క‌దిలించిన నేత‌, ఉద్య‌మానికి ఉద్యోగుల సైడ్ నుంచి ఊపిరులూదిన నేత దేవీప్ర‌సాద్ భ‌విత‌వ్యం ఇప్పుడు అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ట‌! కేసీఆర్‌ను న‌మ్ముకుని తెలంగాణ ఉద్య‌మం అనంత‌రం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆయ‌న త‌న ఉద్యోగాన్ని వ‌దులుకున్నారు. అయితే, అనంత‌రం ఆయ‌న ఎమ్మెల్సీగా విజ‌యం సాధించ‌లేక‌పోయారు. దీంతో ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్నారు. అయితే, త‌న‌ను కేసీఆర్ ప‌ట్టించుకుంటార‌ని, పార్టీలో ఏద‌న్నా ప‌ద‌విని ఇస్తార‌ని దేవీ భావించారు.

అయితే, కేసీఆర్ నుంచి ఎలాంటి ఆఫ‌ర్ రాలేదు. దీంతో అటు ఉద్యోగాన్ని వ‌ద‌లుకుని, ఇటు వ‌స్తుంద‌నుకున్న ఎమ్మెల్సీ సీటు కూడా ద‌క్క‌క నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ట ఆయ‌న‌. ఇదే విష‌యం ఇటీవ‌ల కేసీఆర్ స‌మ‌క్షంలో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని తెలిసింది. దీనికి స్పందించిన కేసీఆర్‌.. త్వ‌ర‌లోనే ఏదైనా చూద్దామ‌ని అన్నార‌ట‌. అయితే, స్ప‌ష్ట‌మైన హామీ రాలేద‌ని దేవీ స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ ప‌రిణామం ఉద్యోగ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది. ఇదిలావుంటే, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ప్రొఫెస‌ర్ కోదండ రాం.. త‌న జ‌ట్టులోకి వ‌చ్చేయాల‌ని దేవీకి ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌.

అయితే, ఇప్ప‌టికే ఉద్య‌మాల‌తో అలిసిపోయిన .. దేవీ.. మ‌ళ్లీ కోదండ రాం జ‌ట్టులో చేరితో ఇక‌, రాబోయే ఎన్నేళ్ల‌యినా.. ఉద్య‌మాలకే ప‌రిమితం కావాల‌ని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ విష‌యంలో పొర‌పాటుగా వ్య‌వ‌హ‌రిస్తే.. కేసీఆర్ ఆగ్ర‌హం సైతం క‌ళ్ల‌చూడాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. దీంతో ఎన్నాళ్ల‌యినా.. వెయిట్ చేయాల‌నే డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ఒక్కొక్క‌సారి అన్నీ క‌లిసిరావడం కుద‌ర‌దు అన‌డానికి దేవీయే నిద‌ర్శ‌నం అంటున్నారు నేత‌లు!!