అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.

జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కి అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది.. జేసీ బ్రదర్స్ , ప్రభాకర్ చౌదరి ఎప్పుడు.. ఎక్కడ ఎదురు పడినా గొడవ ఖాయం అనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. తాజాగా, మొన్నటి జెడ్పీ సమావేశంలోనూ ఈ ఇద్దరు నేతలు పరస్సరం తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయిలో నడిచింది.

జేసీ దివాకరరెడ్డి, వైకుంఠం ప్రభాకరరెడ్డిల వాగ్వాదం విన్నవారికి.. ఇది పాలక, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రచ్చ అన్న భావనే కలిగింది. ఆస్థాయిలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం , ఆక్రమణల తొలగింపు, రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ఈ రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో ప్రతిపక్షం వైసీపీ కి ఇక్కడ మాట్లాడే అవకాశమే రాకపోలేదు.
.
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య తీవ్ర ఘర్షణ కొత్తేమీ కాదు. గతంలోనూ చాలాసార్లు ఇద్దరు నేతల మధ్య వాగ్యుద్ధాలు.. పరస్పరం అవమానించుకోవడాలూ నడిచాయి. గతంలో ఓసారి అనంత ఎమ్మెల్యే ఇంటి ముందు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి అనుచరులు గలాటా సృష్టించారు… దీంతో ఎమ్మెల్యే అనుచరులూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో గొడవకు దిగారు.. అప్పుడు కూడా సేమ్ సీన్.. అదే గందరగోళం… అభివృద్ది పనుల విషయంలో తమమధ్య కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయని గతంలో జేసీ బ్రదర్స్ చెప్పినా ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరుగుతోందని తెలుగు తమ్ముళ్లంటున్నారు.

గతంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయమంతా ఆయన కనుసన్నల్లో నడిచేది… జెసీ దివాకర్ రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ కాంగ్రెస్ లో ఆయన తాడిపత్రికి మాత్రమే పరిమితమయ్యే వారు.. 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా టీడీపీ టిక్కెట్ పై జేసీ దివాకర్ రెడ్డి గెలిచారు.. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అప్పట్నుంచి జిల్లాలో అనంతపురం ఎంపీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, స్థానిక ఎమ్మెల్యేలపై జేసీ పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు… ఉరవకొండ టీడీపీ ఇంచార్జ్ పయ్యావుల కేశవ్ కూడా జేసీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు.. కానీ అనంతపురం… జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ మరింత పట్టుకోసం జేసీ బ్రదర్స్ ప్రయత్నించడమే వివాదాలకు కారణమైందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
పట్టు సాధించేందుకు జేసీ బ్రదర్స్‌ ప్రయత్నం.