అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్ టు డీఎంకే

త‌మిళ‌నాడు రాజకీయాల్లో అత్యంత వేగ‌వంత‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌లలిత మ‌ర‌ణంతో ఆ పార్టీ ఒంట‌రి అయిపోయింది. అమ్మ‌కు ముందు చూపు లేక‌పోవ‌డంతో పార్టీకి వార‌సుడిని త‌యారు చేయ‌ని ఫ‌లితం ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో పార్టీని ఎవ‌రు న‌డిపించాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌క‌పోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వార‌సులు పుట్ట‌గొడుగులా త‌యార‌య్యారు.

దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా అన్నాడీఎంకేకి పేరుంది. అమ్మ‌మాట వేద‌వాక్కుక‌న్నా ఎక్కువ‌గా ఆ పార్టీ నేత‌లు భావిస్తారు. అలాంటి అమ్మ మ‌ర‌ణంతో వారిలో ఒక్క‌సారికి క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టుత‌ప్పుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

త‌మ‌కు టికెట్ ఇచ్చి గెలిపించిన అమ్మ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు, విప‌క్ష క‌రుణ పార్టీలో చేరేందుకు ప‌లువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీనికితోడు.. అనాథ‌లా క‌నిపిస్తున్న అన్నాడీఎంకే నుంచి కొన్ని వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా తిరిగి అధికారం చేప‌ట్టే ఛాన్స్‌పై డీఎంకే అధినేత, 93 ఏళ్ల క‌రుణానిధి ప‌క్కా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కేవ‌లం 19 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు త‌న‌కు ల‌భిస్తే.. అధికారంలోకి వ‌చ్చేయొచ్చ‌న్న ప్లాన్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు క‌రుణ వ‌ల విసురుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ నెల 20న పార్టీ ఎమ్మెల్యేల‌ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఉప్పునిప్పులా మండిప‌డే సోద‌ర ద్వయం స్లాలిన్‌, అళ‌గిరిల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చారు.

ఈ ప్ర‌యత్నాలు చూస్తుంటే.. అన్నాడీఎంకే అధికారానికి ఎస‌రు వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. పైకిమాత్రం మొన్నామ‌ధ్య స్టాలిన్ ఇలాంటి ఫిరాయింపుల‌ నీచ రాజ‌కీయాలకు పాల్ప‌డ‌మ‌ని చెప్పారు. కానీ… ప‌రిస్థితి మాత్రం ఇప్పుడు చ‌క‌చ‌కా మారిపోతోంది. ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఓ వారం ఆగాల్సిందే.