అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?

కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు.

ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ అనే నిందితుడు ముగ్గురు డాక్టర్ల పేర్లు వెల్లడించాడు. వీరు ఇతర రాష్ట్రాల్లోనూ పలువురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, అధికారులు ప్రశ్నించాలనుకున్న వైద్యుల్లో ఒకరు అమెరికాలో ఉన్నారు. 9 తేదీనే ఆయన ఇండియా రావాల్సిఉన్నా రాలేదు. దీంతో పోలీసులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటుచేశారు. సదరు డాక్టర్ రాగానే అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కు సంబంధించిన కొన్ని ఖాళీ డాక్యుమెంట్లపై ఈ డాక్టర్ సంతకాలు చేసినట్లు తేలింది. ఫార్మాలిటీస్ అన్నీ ఆయన అసిస్టెంట్లు పూర్తిచేస్తారు. ఈ అసిస్టెంట్లలో ఒకరిని శుక్రవారమే అరెస్ట్ చేశారు.

దాతలకు సంబంధించిన కిడ్నీ రాకెట్ ఉదంతంలో ఈ వైద్యుడి పేరు బయటకొచ్చింది. రాజ్ కుమార్ రావ్ కూడా ఈయన పేరు చెప్పడంతో పోలీసులు పట్టుబిగించారు. ముగ్గురు నెఫ్రాలజిస్టులతో పాటూ అపోలోకు చెందిన మరో అయిదుగురు సీనియర్లకు నోటీసులిచ్చారు. ఈ రాకెట్ కు సంబంధించి ఇప్పటివరకూ పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ముఠా సభ్యులనే కాక వారి బంధుమిత్రులు, దాతలు కూడా ఉన్నారు.