అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు

కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి.

రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు పరిశీలిస్తామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అమరావతిని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇది కూడా ఓ ప్రయత్నంగా అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజధాని నిర్మాణం అత్యంత ముఖ్యమైన సందర్భం. రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. రాజధాని నిర్మాణంలో సహకరించకపోయినా తప్పులేదేమోగానీ, రాజధానికి అడ్డుతగలడం ఎవరికీ సబబు కాదు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం అలాగే రాజధాని కారణంగా భూములు కోల్పోయే రైతులకు న్యాయం జరిగేలా, మెరుగైన ప్యాకేజీ దక్కేలా పోరాటం చేయడం చేయడం వరకూ తప్పులేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత అయినా రాజధాని విషయంలో అన్ని వర్గాలూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆశిద్దాం.