అమీర్ ఖాన్ మరీ ఇంత చీప్ ఏంటి!

పెద్దోళ్ళయ్యాక బుద్ధులు చిన్నవైపోతాయట. బాలీవుడ్‌ ప్రముఖ హీరో అమీర్‌ఖాన్‌కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. స్టార్‌డమ్‌ని ‘వెయిటర్‌’తో పోల్చాడీయన. ఇంకో ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌కి స్టార్‌డమ్‌ ఉందిగానీ, తనలా ఆయన అంత గొప్పవాడు కాదని అమీర్‌ఖాన్‌ చెప్పాలనుకున్నాడో, పాత్రికేయులను చులకన చేయాలనుకున్నాడో, వెయిటర్‌ అనే జాబ్‌ని తక్కువ చేసి చూడాలనుకున్నాడో తెలియదుగానీ అమీర్‌ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలిక్కరచుకున్నాడు.

సల్మాన్‌ఖాన్‌ లాంటివారు వస్తే మీడియా అతన్ని స్టార్‌లా చూస్తుందని చెబుతూ తాను వస్తే మాత్రం వెయిటర్‌లా భావిస్తారని అన్నాడు అమీర్‌ఖాన్‌. మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత్రికేయ సోదరులు బిత్తరపోయారు. తన న్యూ మూవీ ‘దంగల్‌’ ప్రమోషన్‌ కోసం పాత్రికేయుల ముందుకు వచ్చి అమీర్‌ఖాన్‌ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకో తెలియదు బాలీవుడ్‌ తారలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్నారు. ఇది హాస్యాస్పదమే అవుతుంది. సల్మాన్‌ఖాన్‌ తన కొత్త సినిమా ‘సుల్తాన్‌’ కోసం చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశాడు ఇలాగే. షూటింగ్‌లో పడ్డ కష్టం గురించి చెప్పమంటే, రేప్‌కి గురైన బాధితురాలి పరిస్థితిలా తన పరిస్థితి ఉండేదని చెప్పి జనంతో ఛీత్కారాలు అందకున్నాడు. సత్కారాలు అందుకోవాల్సిన నటులు ఛీత్కారాలపై వ్యామోహం పెంచుకోవడమేమిటో!