అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్‌

ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల మ‌ధ్య వింత ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో స‌భ్యుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు స‌వాళ్లు, రాజీనామాల వ‌రకూ విష‌యం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన చ‌ర్చ ఆసాంతం వాడివేడిగా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య స‌వాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభ‌ద్ర‌తా భావ‌నికి లోనైందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అగ్రిగోల్డ్‌తో మొదలు పెట్టి మంత్రులు పత్తిపాటి పుల్లారావుపై ఆరోపణల చుట్టూ తిరిగి చివరకు సాక్షిలో వచ్చిన కథనాలపై చర్య వరకూ నడిచిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వ్యవహారాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత జగన్‌ లేవనెత్తిన అంశాలు, ఆయన చేసిన ఆరోపణలు టీడీపీ నేత‌లు ప‌ట్టిచుకోకుండా వ‌దిలేయ‌వ‌చ్చనేది అభిప్రాయం! కానీ వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరస్పర రాజీనామాలను షరతులుగా చర్చ నడవడం ఇది వరకు ఎన్న‌డూ లేద‌ని కొందరు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. న్యాయవిచారణకు సిద్ధమంటూనే నిజమని తేలకపోతే ప్రతిపక్ష నేత వైదొలగాలని షరతు పెట్టడం గతంలో ఎన్నడూ చూడ‌న‌లేద‌నేది వారి వాద‌న‌!

గతంలో రాజధాని భూములపై చర్చ సందర్భంలోనూ ఇదే ప్రహసనం నడిచింది. తర్వాత దాన్ని ఎప్పుడో స్పీకర్‌ వ్యాఖ్యలకు సంబంధించి సాక్షిలో వచ్చిన ప్రచురణలపైకి మళ్లించి చర్య తీసుకోవాలనడం, ఆ సమయంలో సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసలు రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చనే లేదని ఏవో భాష్యాలు చెప్పడం అంతా విచిత్రమే. జగన్‌ కూడా సభలో స్పందించకుండా బయిట మాట్లాడ్డం ద్వారా సమస్యను దాటేశారనే చ‌ర్చ మొదలైంది. అగ్రిగోల్డ్‌ సమస్య పూర్వాపరాలు ఆయన చేసిన వాదనలో హేతుబద్దత ఉందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చ‌ర్చ సంద‌ర్భంగా సభలో పాల్గొనడం, ప్రభుత్వ వ్యాఖ్యలకు స్పందించడంలో వ్యూహం లేద‌ని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వాధినేత అన్నిసార్లు లేచి అంత ఆవేశంగా మాట్లాడ్డం అనవసరమైన అభద్రతను ప్రతిబింబిస్తోందని వివ‌రిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను వదిలేసి మంత్రిపై ఆరోపణలనే వివాదంగా మార్చుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం. అధికార పక్షం దూకుడు అందులోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి నిరంతర జోక్యం చూస్తుంటే ప్రతిపక్షంపై తీవ్ర దాడికే సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.