అసెంబ్లీ సాక్షిగా బాలయ్య సంచలన ప్రకటన

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ మ‌ధ్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తానే స్వ‌యంగా ఎన్టీఆర్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాని చెప్పి.. ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఇప్పుడు నూతన అసెంబ్లీ వేదిక‌గా మారో సంచ‌ల‌నానికి నాంది ప‌లికాడు బాల‌య్య!! సినిమా ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తికి తీసుకొచ్చేస్తామ‌ని చెప్పి.. అటు సినీ వ‌ర్గాలు ఖంగు తినేలా చేశాడు. అయితే విశాఖకు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. మ‌రి ఇప్పుడు అమ‌రావ‌తికి తీసుకొస్తామంటే బాల‌య్య‌కు అది సాధ్య‌మేనా అనేది ప్ర‌శ్న‌!!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టాలీవుడ్ ఎక్క‌డ ఉండాల‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. మొత్తం స్టూడియోల‌న్నీ హైద‌రాబాద్‌లోనే ఉండ‌టంతో  సినీ ప‌రిశ్ర‌మ తెలంగాణ‌కే ప‌రిమిత‌మైంది, అయితే నవ్యాంధ్ర‌లోని విశాఖ‌కు సినీ ప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని ఎప్ప‌టినుంచో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ ఇవ్వ‌న్నీ ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. అయితే సోమ‌వారం అమరావతిలో కొత్తగా ప్రారంభించిన ఏపీ అసెంబ్లీ సాక్షిగా.. సీనియర్ స్టార్-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి షిఫ్ట్ చేసే ప్రతిపాదన ఉందన్న బాలయ్య.. దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే.. హైద‌రాబాద్ నుంచి తెలుగు సినిమాను షిఫ్ట్ చేయడం అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు నుంచి వినిపిస్తూనే ఉంది. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆ తర్వాత ఈ విషయంపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అమరావతికి టాలీవుడ్ అనడంతో.. మళ్లీ ఇది హాట్ టాపిక్  అయింది. హైద‌రాబాద్ నుంచి తరలించడం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అమరావతిలో టాలీవుడ్ అనగానే.. బోలెడన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చేయడం ఖాయం. అప్పట్లో మాదిరిగా 2-3 స్టూడియోలతో సరిపెట్టేసుకునే  సిట్యుయేషన్ కాదు.

ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని.. అనేక వసతులు- సౌకర్యాల కోసం రకరకాల ప్రపోజల్స్ వచ్చేయడం ఖాయం. ఇవన్నీ ప్రారంభం సంగతి పక్కన పెడితే.. ముందు అమరావతిలో ల్యాండ్స్ కోసం పోటీ పడ్డం అని చెప్పచ్చు. అమ‌రావ‌తిలో భూమి ఉన్నా.. సినీ ప‌రిశ్ర‌మ‌లు నిర్మించేందుకు అనువైన ప్రాంతమా కాదా అనేది కూడా ఆలోచించాల్సిన అవ‌స‌ర‌ముంది.  అప్పుడు వైజాగ్ పేరు చెబితే కదలని సినిమా పరిశ్రమ.. ఇప్పుడు అమరావతి అంటే కదులుతుందా అన్నదే అసలైన డౌట్! మ‌రి ఇప్పుడు బాల‌య్య మాట‌లను ఎంత వ‌ర‌కూ న‌మ్మొచ్చో తెలియ‌ని ప‌రిస్థితి!!