ఆదుకొని బీజేపీ అప్పో రామ‌చంద్రా.. అంటున్న ఏపీ

అప్పు.. పొద్దున్న లేచింది మొద‌లు.. నిద్ర‌పోయే వ‌రకూ ఏపీ యంత్రాంగం అంతా ప‌టిస్తున్న మంత్రం!! అప్పో రామ‌చంద్రా అంటూ.. మొక్కులు మొక్కేస్తున్నారు! ఈ అప్పుల క‌ష్టాల నుంచి త‌ర్వ‌గా గ‌ట్టెక్కించు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు! అవును.. విభ‌జ‌న నుంచి కోలుకోలేని ఏపీ.. ఇప్పుడు అప్పుల ఊబిలో క్ర‌మ‌క్ర‌మంగా కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు బీజేపీ ముందుకు రాక‌పోవ‌డం.. అటు ప‌రిశ్ర‌మ‌లు కూడా హామీల‌కే ప‌రిమితమ‌వ‌డంతో ఆర్బీఐ ముందు రుణాల కోసం చేతులు చాచాల్సి వ‌స్తోంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడం, అభివృద్ధి కోసం అప్పులు చేయకతప్పకపోవడంతో వడ్డీల భారం పెరుగుతోంది. దీంతో, వడ్డీల భారం నానాటికీ పెరుగుతోంది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.14,768 కోట్లు కేవలం వడ్డీ చెల్లింపులకే పోనున్నాయి. 2015-16లో రాష్ట్ర ప్రభుత్వం రూ.10,130 కోట్ల మేరకు వడ్డీలు చెల్లించింది. 2016-17 తాజా అంచనాల ప్రకారం రూ. 11,993 కోట్లు. 2017-18లో వడ్డీల మొత్తం రూ.14,768 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ పెరుగుదల ఆందోళన కారకంగా మారింది. 2017-18లో మూల ధన వ్యయంకోసం తీసుకునే రుణాల్లో ఓపెన్‌ మార్కెట్‌ రుణాలు రూ.26,819 కోట్లుగా ప్రతిపాదించారు. అందులో వడ్డీల చెల్లింపుల కోసం 55.07 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మరోవైపు రుణాలు తిరిగి చెల్లించేందుకు కేటాయించే మొత్తాలూ పెరుగుతున్నాయి.

రుణ చెల్లింపులకోసం వెచ్చించిన మొత్తం 2015-16తో పోలిస్తే 2016-17లో తగ్గింది. అయితే, 2017-18లో భారీగా పెరుగుతుందని బడ్జెట్‌ అంచనాలు చెబుతున్నాయి. 2015-16కు సంబంధించి తాజాగా నిర్ధారించిన గణాంకాల ప్రకారం రుణ చెల్లింపులు రూ.5,842 కోట్లు. 2016-17 సవరించిన అంచనా ప్రకారం ఈ మొత్తం రూ. 3,756 కోట్లు. 2017-18 బడ్జెట్‌ ప్రతిపాదనలో ఏకంగా రూ.8,009 కోట్లకు పెరిగింది. మొత్తంగా… 2017-18లో వడ్డీలు, రుణ చెల్లింపులు కలిపి 22,777 కోట్లు అవుతోంది. గత రెండేళ్లలో దాదాపు సమానంగా ఉన్న రుణ-వడ్డీ చెల్లింపుల మొత్తం… 2017-18లో అమాంతం పెరగనుండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

రుణ మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం ఇస్తే కొంత ఉపశమనం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అప్పుల్లో అధిక వాటా, వాటిపై వడ్డీలు భారీగా చెల్లించవలసి రావడం ఇప్పుడు ఖజానాకు భారంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్న ఓపెన్‌ మార్కెట్‌ రుణాలకూ 8 నుంచి 9 శాతం వరకూ వడ్డీ ఉంది. ఈ నేపథ్యంలోనే… రాష్ట్ర ప్రభుత్వం రుణ మార్పిడి కోరుతూ ఆర్‌బీఐకి లేఖ రాసింది. మ‌రి ఆర్బీఐ క‌రుణిస్తుందో లేదో!!