ఆ ఒక్కడే కేసీఆర్ కు కంట్లో నలుసు

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం నానాటికీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు రెట్టింపు స్థాయిలో బ‌ల‌హీన‌ప‌డుతున్నాయి! కేసీఆర్ ఢీ కొట్టాల‌ని పార్టీలు, నాయ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ వుతున్నాయి! ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గ‌జ నేత‌లు కేసీఆర్‌ను ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నా వారిలో లుక‌లుక‌లు, క‌ల‌హాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి! అయితే ఒకే ఒక్క‌డు మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టే స్థాయిలో చెల‌రేగిపోతున్నాడు! కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా, కంట్లో న‌లుసులా మారిపోయాడు! అత‌డే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి!!

తెలంగాణ సెంటిమెంట్ నినాదంతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌.. త‌దుప‌రి రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. బ‌లంగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్, టీడీపీల‌ను భూస్థాపితం చేసే దశ‌కు వెళ్లిపోయింది. దీంతో పూర్వ‌వైభ‌వం కోసం ఆ పార్టీలు ఇప్పుడు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. విడివిడిగా కంటే క‌ల‌సిక‌ట్టుగా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించాయి. సెంటిమెంట్ ల‌క్‌తో అధికారం చేజ‌క్కించుకున్న టీఆర్ ఎస్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై గ‌ట్టిగా ఉద్యమించేందుకు అధికార‌పార్టీను నిల‌దీసేందుకు స‌రైన నేత‌లే క‌రువ‌య్యారు.

కాంగ్రెస్‌లో జానా రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మ‌య్య‌ వంటి సీనియ‌ర్ నేత‌లు ఉన్నా.. వారిలో ఐక్య‌త లేద‌న్న‌ది వాస్త‌వం! ముఖ్యంగా జానారెడ్డి.. టీఆర్ఎస్ విధానాల‌ను, కేసీఆర్‌ను సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా పొగిడేస్తున్నారు! దీంతో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌ల‌హాలు అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్నాయి! ఇక కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఫైర్ అవుతున్నాడు. దొర‌ల‌పాల‌న అంటూ కేసీఆర్ పాల‌న‌పై ధ్వ‌జ‌మెత్తాడు. ఓటుకు నోటు కేసులో జైలు కెళ్లి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత దాడి తీవ్ర‌త‌ను పెంచాడు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుకు కేబినెట్ హోదా ఇవ్వ‌టంపై కోర్టును ఆశ్ర‌యించారు. రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై గ‌ళ‌మెత్తారు. మ‌రి కారు వేగానికి  రేవంత్ బ్రేకులేస్తాడేమో వేచిచూద్దాం!