ఆ మంత్రిని వ్యూహాత్మకంగా తొక్కిన చంద్ర‌బాబు

మంత్రి వ‌ర్గ విస్త‌రణ తర్వాత‌.. శాఖ‌ల కేటాయింపుల్లో సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే విష‌యం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో దూకుడి వ్య‌వ‌హ‌రించే అచ్చెన్నాయుడుని కార్మిక శాఖ నుంచి ర‌వాణా శాఖ‌కు మార్చ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. స్వయం ప్రతిపత్తి కల ఆర్టీసీలో బతిమిలాడి పనిచేయించు కోవాలే తప్ప శాసించి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దూకుడు స్వభావంతో అధికార యంత్రాంగాన్ని వణికించిన ఇద్దరు పోలీసు అధికారులపై ఆయ‌న‌ అధికారం చెలాయించగలరా? అనే ప్ర‌శ్న మొద‌లైంది.

రవాణా శాఖలో ఆ శాఖ కమినషర్‌ బాలసుబ్రహ్మణ్యం …రవాణా శీతయ్యగా పేరు తెచ్చుకున్నారు. ఈ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులపై అవినీతిశాఖ అధికారులతో దాడులు చేయించారు. అక్రమ ఆస్తులను బయటకు తీశారు. నిజాయితీతో పాటు సమర్థత, చిత్తశుద్ది ఉన్న ఉద్యోగులను కీలక ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో వారిని ఆయన నియమిస్తున్నారు. నిన్నటి వరకు ఈ శాఖకు మంత్రిగా ఉన్న శిద్దా రాఘవరావు ఉత్సవ విగ్రహంలా పనిచేశారే తప్ప ఆ శాఖపై పట్టు సాధించలేకపోయారు. ఆయన హయాంలో ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు నిర్వహించిన ప్రస్తుత ఇన్‌ఛార్జి డిజిపి సాంబశివరావు, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంకు సిఫార్సు చేయాలంటే ఆయ‌న‌కు వణుకు పుట్టేదట.

ఆనాడు ఇద్దరూ పోలీసు అధికారులే. ఇప్పుడూ పోలీసు అధికారులే ఆ పోస్టులో ఉన్నారు. మాలకొండయ్య, బాలసుబ్ర హ్మణ్యం నిజాయితీపరులే. ఆర్టీసీ సంస్థలో స్వయం ప్రతిపత్తి పాటు ఆ సంస్థల్లో నూతన ఉద్యోగాలపై నిషేధం ఉండడంతో రాజకీయ నాయకులకు పెద్దగా పని ఉండదు. కానీ రవాణాశాఖలో పోస్టింగ్‌లు, బదిలీలు చేయించగలిగితే రాజకీయ నాయకులకు లక్షలు ముడతాయి. కానీ రవాణా శీతయ్యగా పేరున్న బాలసుబ్రహ్మణ్యం ఏ ఒక్కరి సిఫార్సుకు విలువ ఇవ్వరని పేరుంది.

సీఎం ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం, మాలకొండయ్యలపై పెత్తనం చేయటం అంత సులభం కాదని ఆ శాఖ ఉద్యోగులు వ్యంగ్యంగా చెబుతున్నారు. ఈ విషయం అచ్చెన్నకు కూడా తెలుసు. కానీ ఎలా ముందుకు వెళ్లాలో అంతు పట్టడం లేదట‌. రవాణాశాఖను పట్టించుకోకుండా కేవలం బీసీ సంక్షేమ‌ శాఖకు మంత్రిగా అధికారం చెలాయిస్తే కొంత పరువైనా నిలుస్తుందని ఆయ‌న భావిస్తున్నారు. ఆ ఇద్దరు పోలీసు అధికారులతో మంత్రి అచ్చెన్న మాత్రమే ఫోన్‌లో మాట్లాడాలే తప్ప ఆయన అంతరంగిక అధికారులు అంత ధైర్యం చేయ‌లేక‌పోత‌న్నార‌ట‌. ఇది కొంత వ‌రకూ అచ్చెన్న స్పీడ్‌కు బ్రేక్ వేసిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.