ఆ మంత్రి పోస్ట్ ఊస్టింగ్‌పై లోకేశ్ సిగ్న‌ల్స్‌

ఏపీ మంత్రి రావెల‌కి మంత్రి వ‌ర్గం నుంచి ఉద్వాస‌న ప‌లికే స‌మ‌యం ఆస‌న్న‌మైందా? ప్ర‌స్తుతం దావోస్‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు ఏపీకి రాగానే మంత్రి వ‌ర్యుల‌ను మ‌ర్యాద‌గా ఇంటికి సాగ‌నంపుతారా? ఇన్నాళ్లూ.. ప‌ద‌విని చూసుకుని రెచ్చిపోయిన రావెల ఇక ప‌ద‌వీచ్యుతుడై.. త‌న నియోజ‌క‌వర్గంలో కేవ‌లం ఎమ్మెల్యేగా మిగులుతారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌త కొన్నాళ్లుగా సొంత పార్టీలోనే రావెల‌కు వ్య‌తిరేకత ఎక్కువైంది. అయిన‌వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ అన్న‌చందంగా పార్టీ కోసం అహ‌ర‌హం శ్ర‌మించిన నేత‌ల‌ను పూచిక పుల్ల‌ల్లా తీసిపారేస్తున్నార‌ని రావెల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా రావెల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ సీనియ‌ర్లు ఆయ‌న‌పై దండెత్తారు. దీనికి రావెల స్వ‌యంకృతమే ఎక్క‌వగా క‌నిపిస్తోంది. గ‌తంలో పార్టీ విప‌క్షంలో ఉన్న‌ప్పుడు సైతం పార్టీ జెండాను భుజాన మోసుకుని.. అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంలో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ నేత‌ల‌ది ప్ర‌ధాన పాత్ర‌. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు ఒక్క‌మాట కూడా చెప్ప‌కుండా.. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఎలాంటి పాత్రా పోషించ‌కుండా డైరెక్ట్‌గా ఎమ్మెల్యే టిక్కెట్ ప‌ట్టేసిన రావెల‌కి సైతం ప్ర‌త్తిపాడు నేత‌లు.. జై కొట్టారు. దీంతో అధిక మెజారిటీతో రావెల గెలుపొందారు.

కానీ, ఆ త‌ర్వాతే ఆయ‌న త‌న విశ్వ‌రూపం చూపించారు. త‌న గెలుపుకోసం, పార్టీకోసం ఎంతో శ్ర‌మించిన వారిని ప‌క్క‌కు పెట్టి.. త‌న అనుంగుల‌కు పెద్ద పీట వేయ‌డం, త‌న సామాజిక వ‌ర్గం వారికే పెద్ద‌పీట వేయ‌డం వంటివి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దారితీశాయి. అంతేకాదు.. ఈ విష‌యంలో స్థానిక టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున రావెల‌కు వ్య‌తిరేకంగా అధినేత చంద్ర‌బాబుకి సైతం ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో రావెల‌కు వ్య‌తిర‌కంగా వారు చిన‌బాబు, సీఎం త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌ను విన్న‌వించుకున్నార‌ట‌. దీంతో బాబు.. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. సో.. దీంతో రేపో మాపో రావెల ప‌ద‌వి ఊడ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .