ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. వాళ్ళ మాటల సారాంశం ఒక్కటే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని. అదే సంజీవ‌ని అని రాజ్య‌స‌భ‌లో పోరాడిన వెంక‌య్య నాయుడు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. హోదాతో క‌లిగే వ‌న్నీ ప్యాకేజీతో వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ప్రత్యేక హోదా అద్భుతం…అక్షయ పాత్ర అనే రేంజ్‌లో అటు టీడీపీ, బీజేపీ నేత‌లు మోసేశారు. ఆంధ్రప్రదేశ్‌కి హోదానే సర్వస్వం, అదే ప్రాణాధారం అని ప్రజలు నమ్మించి ఆశలు రేకెత్తించారు. మ‌నోభావాల‌తో ఆడుకుని ఓట్లు దండుకున్నారు. కానీ ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు, మోడీ వాటిని తుంగలో తొక్కేశారు. కానీ రెండున్న‌రేళ్ల త‌ర్వాత హామీ ఇవ్వ‌లేమ‌ని చెబుతూ.. అందుకు త‌గిన ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే హామీ నెర‌వేర్చాల‌ని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. ప్యాకేజీకి జై కొట్టింది.

ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్న దిశగా ఆలోచన చేస్తున్న అంద‌రూ ఆ ప్రయత్నాలను మానుకోండి. కేంద్రప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు, పోరాటం చెయ్యొద్దు` అన్న సందేశాన్ని వినిపిస్తున్నారు. ఇక రేపట్నుంచి వెంకయ్య, చంద్రబాబు, టిడిపి అనుకూల మీడియాలు రంగంలోకి దిగుతారనడంలో సందేహం లేదు. అధికార బలగం, మీడియా బలం మొత్తం ఒక్కటయిపోయినప్పుడు ఏ పౌరులు మాత్రం ఎంత వరకూ పోరాడగలరు?

తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం, మీడియా, సెలబ్రిటీలు అక్కడి యువతకు సహకరించినట్టుగా ఇక్కడ కూడా ముందుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ యువతరం సత్తా ఏంటో? తమిళ యువతకు ఉన్న శక్తి సామర్థ్యాలు, పోరాడాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఉన్నాయి. తేడా అంతా కూడా ప్రభుత్వ పెద్దలు, ఆర్థిక పెద్దలు, సినిమా పెద్దల్లోనే ఉంది. కాదని ఎవరైనా చెెప్పగలరా?