ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!

తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ అభివృద్ధికి ఇక్కడి ప్రభుత్వం సహకరించడంలేదని విమర్శించగా, ఆ విమర్శల్ని టిఆర్‌ఎస్‌ నాయకులు ధీటుగా తిప్పి కొట్టారు.

అన్ని విషయాల్లోనూ బిజెపి తెలంగాణకు అన్యాయం చేసిందని హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌ తదితర మంత్రులు విమర్శించారు. బిజెపికి, తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదంటూ అంకెలతో సహా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిన నిధుల గురించి, కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిన వైనం గురించీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మేనేజ్‌ చెయ్యడానికి చంద్రబాబు ఉన్నారు. కానీ తెలంగాణలో బిజెపి ఆటలు చెల్లవు. లెక్కలు పక్కాగా బిజెపి ముందు ఉంచి, కడిగిపారెయ్యగల సత్తా టిఆర్‌ఎస్‌ నాయకులకు ఉంది. చంద్రబాబు కూడా ఇలాగే ఉండగలిగితే ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరిగేది. కానీ మిత్రధర్మమంటూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని బిజెపికి తాకట్టు పెట్టడం జరుగుతున్నది.