ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో లోగుట్టు…!

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అటు కేంద్రం, ఇటు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రి వెనుక ఏదైనా దాగి ఉందా?  నిజానికి విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కూడా చంద్ర‌బాబు ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారా? ప‌్యాకేజీ తీసుకోవ‌డం వెనుక ఏదైనా గుట్టు దాగి ఉందా? అంటే ఔన‌నే అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు. నిన్న జ‌రిగిన విశాఖ ఆందోళ‌న విఫ‌లం అనంత‌రం, దీనిపై కేవీపీ ఢిల్లీలో స్పందించారు. శుక్ర‌వారం ఉద‌యం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. చంద్ర‌బాబు కావాల‌నే ఉద్దేశ పూర్వంగా హోదా రాకుండా చేశార‌ని అన్నారు.

నిజానికి రాష్ట్ర విభ‌జ‌న సమ‌యంలో రాజ్య‌స‌భ సాక్షిగా ఏపీకి హోదాను ప‌దేళ్లు కావాలంటూ డిమాండ్ చేసిన‌.. వెంక‌య్య‌నాయుడు ఇప్పుడు మాట త‌ప్ప‌డం వెనుక‌, అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాని ఐదేళ్లు కాదు.. ప‌దిహేనేళ్లు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన చంద్ర‌బాబులు ఇప్పుడు మాట‌మార్చార‌ని కేవీపీ అన్నారు. మొత్తానికి హోదా ద‌క్క‌క‌పోవ‌డానికి ఈ ఇద్ద‌రు నాయుళ్లే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆనాడు రాజ్య‌స‌భ‌లో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌క‌టించినా.. అమ‌లు చేయక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

ఇక‌, పోల‌వ‌రం ప‌నుల విష‌యంలోనూ కేవీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌నులు సూప‌ర్ ఫాస్ట్ వేగంతో జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. కాంట్రాక్టు సంస్థ న‌త్త‌న‌డ‌క‌న చేస్తోంద‌ని ఆరోపించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టీడీపీ ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అల్లుడే ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టు సంస్థ అధిప‌తి అని. ఈ కార‌ణంగానే డ‌బ్బులు ఇస్తే.. చేస్తూ.. ఇవ్వ‌క‌పోతే.. ఆపేస్తున్నార‌ని ఆరోపించారు.

నిజానికి కాంట్రాక్టు తీసుకున్న వ్య‌క్తి.. ప‌ని పూర్త‌య్యాక డ‌బ్బుల కోసం అర్జీ పెట్టుకోవాల‌ని కానీ. పోల‌వరం విష‌యంలోనూ చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగా కాంట్రాక్టు సంస్థ కూడా అలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. మొత్తానికి ప్యాకేజీ పేరుతో చంద్ర‌బాబు, వెంక‌య్య‌లు పెద్ద ఎత్తున నాట‌కాలు ఆడుతున్నార‌ని కేవీపా ఆరోపించారు.