ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే

అధికార‌, విప‌క్ష అధినేత‌ల‌కు త్వ‌ర‌లో స‌రికొత్త త‌ల‌నొప్పి మొద‌లుకానుంది. వ‌చ్చే నెల‌లో ఖాళీ కాబోతున్న‌ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప‌రీక్ష కానుంది. అనుభ‌వం, సామాజిక‌వర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేత‌ను మెప్పించేందుకు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ మొద‌లైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం పైగా సీట్లు లభించనుండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి శాసనసభ్యుల కోటా నుంచి ఒకే ఒక స్ధానం మాత్రమే దక్కనుంది.

గత ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అందించిన ఉత్తరాంధ్రలో పట్టును మరింతగా పెంచుకోవాలని టీడీపీ భావిస్తూండగా, పోయిన చోటే వెతుక్కోవాలన్న రాజకీయ నీతిని అనుసరించి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ శాసనసభ కోటా స్ధానానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాజీ మంత్రులు పోటీ పడుతూండడం విశేషం. బీసీల కోటాలో తమకు ఈ సీటు వరిస్తుంద‌ని వారంతా గాఢంగా నమ్ముతున్నారు. ఉత్తరాంధ్ర త‌ర‌ఫున శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

ఇక, ఇదే జిల్లా నుంచి మరో మాజీ మంత్రి, బీసీ వర్గానికే చెందిన తమ్మినేని సీతారామ్‌ కూడా ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెంచుకున్నారు. ఇక విజయనగరం జిల్లాలో జగన్‌కు సన్నిహితుడిగా మారిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పెద్ద‌ల స‌భ‌కు వెళ్లాల‌ని ఆశిస్తున్నారు. ఆయనకు అటువంటి హామీతోనే పార్టీలోకి జగన్‌ ఆహ్వానించారని స‌మాచారం! ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెనుమత్స్య సాంబశివరాజు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు!

అధికార తెలుగుదేశం పార్టీలోనూ ఎమ్మెల్సీ పోరు తీవ్ర స్ధాయిలోనే ఉంది. అయితే, అధికారం చేతులలో ఉండడం, అత్యధిక సీట్లు దక్కే అవకాశాలు ఉండడం టీడీపీకి శ్రీరామరక్షగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి శాసనసభ సభ్యుల కోటా ద్వారా ఎంపికైన ప్రతిభాభారతి పదవీ విరమణ చేస్తున్నారు. త‌న‌కు మరోమారు అవకాశం ఇవ్వాల‌ని బలంగా కోరుకుంటున్నారు. ఇక విశాఖ నుంచి మైనారిటీ కోటాలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ రహమాన్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తన రాజకీయ మిత్రుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా పైరవీలు చేసుకుంటున్నారు.

మరో వైపు మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. భీమిలీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్‌ఎస్డీపీ అప్పలనరశింహరాజు సైతం పెద్దల సభలో ప్రవేశించేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. వీరికి గంటా వ‌ర్గం మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉండ‌టంతో ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇరు పార్టీల‌కు క‌ఠిన ప‌రీక్ష పెట్ట‌నుంది.