ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎక్క‌డ లేని జోష్ ఇచ్చింది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిప‌డిన బీజేపీ ఇప్పుడు ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.

ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్ర‌యోగించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నార‌ట‌. ఇందుకు మోడీ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు బీజేపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. 2019లోగా ఏపీలో బీజేపీని ప‌టిష్టం చేసే కీల‌క బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి వెంక‌య్య‌కు మోడీ అప్ప‌గించార‌ట‌. ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే వెంక‌య్య‌కే ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తోంది.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం త‌ర్వాత సంగ‌తి..వెంక‌య్య‌, చంద్ర‌బాబుకు పార్టీలు వేరైనా మ‌నుష్యులు మాత్రం ఒక్క‌టే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌కు ఇప్పుడు ఏపీలో బీజేపీని చంద్ర‌బాబు స‌హ‌కారం లేకుండా ఒంట‌రిగా డ‌వ‌ల‌ప్ చేయ‌డం క‌త్తిమీద సాములాంటిదే.

ఏపీలో కాంగ్రెస్‌లో చివ‌ర‌గా మిగిలిన ఉన్న నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న వారిని ఆక‌ర్షించ‌డంతో పాటు రాజ‌కీయాల్లో రాణించాల‌ని ఉత్సాహం ఉన్న వారిని బీజేపీలో చేర్చుకునే ప్లాన్ చేయాల‌ని ఏపీ బీజేపీలో కొంద‌రికి సూచించిన‌ట్టు కూడా తెలుస్తోంది. 2019లో ప‌వ‌న్ జ‌న‌సేన ఎలాగూ ఒంట‌రిగా పోటీ చేస్తుంది. మ‌రి ఇప్పుడు బీజేపీ సైతం ఒంట‌రిగా పోటీ చేస్తే ఎవ‌రికి ఫ్ల‌స్ అవుతుందో ? ఎవ‌రికి మైన‌స్ అవుతుందో ?  మాత్రం చాలా ఉత్కంఠ‌గా ఉంది. ఇక ఏపీలో బీజేపీని డ‌వ‌ల‌ప్ చేయాల‌ని వెంక‌య్య నెత్తిన బాధ్య‌త పెట్ట‌డం ఆయ‌న‌కు పెద్ద అగ్నిప‌రీక్ష లాంటిదే. చంద్ర‌బాబును కాద‌ని వెంక‌య్య ఏపీలో ఎంత వ‌ర‌కు బీజేపీని ఒంట‌రిగా డ‌వ‌లప్ చేస్తాడ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నే.