ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?

కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణకు రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో.. ఉప ఎన్నిక‌ల‌కు టీడీపీ సిద్ధ‌మవుతోంది! అందులోనూ ఈ ఎన్నిక‌ల్లో సేఫ్ గేమ్‌కు తెర‌తీస్తోంది. త‌మ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నిక‌లను ఎదుర్కోవాల‌ని.. వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతో పాటు.. వీరి విజ‌యంతో త‌మ పార్టీకి తిరుగులేద‌ని నిరూపించ‌వ‌చ్చనే వ్యూహంతో బ‌రిలోకి దిగాల‌ని టీడీపీ నాయ‌కత్వం భావిస్తోంది.

వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీల‌తో టీడీపీ ఇంత‌వ‌ర‌కూ రాజీనామాలు చేయించ‌లేదు. ఉప ఎన్నిక‌ల ఊసెత్త‌డం లేదు. అయితే ఎన్నాళ్ల‌ని వాళ్లు ఎలాంటి ప‌ద‌వి లేకుండా ఖాళీగా ఉండ‌గ‌ల‌రు! ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన జంప్ జిలానీల కోరిక‌లు తీర్చేందుకు టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది, ఇందుకు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గర‌ణ‌ను వేదిక‌గా మార్చుకుంటోంది. ఈసారి కేబినెట్‌లో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల‌ను తీసుకోబోతున్నారు. ఇక్క‌డే పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. ఒక వేళ వారికి మంత్రి ప‌ద‌వి ఇస్తే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయించి.. ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇప్ప‌టివ‌రకూ టీడీపీ వెన‌క‌డుగు వేస్తూ వ‌స్తోంది.

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నుంచి సుజ‌య్ కృష్ణ రంగా, నంద్యాల‌లో భూమా నాగిరెడ్డి, ప‌ల‌మ‌నేరులో అమ‌ర‌నాథ‌రెడ్డి… ఈ ముగ్గురికీ మంత్రిప‌ద‌వులు ఇస్తార‌ని బాగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. విస్త‌ర‌ణ అయిన వెంట‌నే వీరుతో రాజీనామాలు చేయించి… ఉప ఎన్నిక‌ల‌కు దింపాల‌న్న‌ది బాబు వ్యూహంగా చెబుతున్నారు. దీంతో విప‌క్షాల నోరు మూయించే అవ‌కాశం ఉంటుంద‌నీ, విలువైన రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని గ‌ట్టిగా చెప్పుకునే అవ‌కాశ‌మూ ఉందనేది వ్యూహంగా తెలుస్తోంది. అయితే, ఈ ముగ్గురి ఎంపిక‌కూ కొన్ని కార‌ణాలు కూడా లేక‌పోలేదు!

ఉప ఎన్నిక‌ల‌కు వెళ్తే అంద‌రూ గెలుస్తార‌న్న న‌మ్మ‌కం తెలుగుదేశం పార్టీకి లేద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఈ ముగ్గురూ త‌మ‌ నియోజ‌కవ‌ర్గాల్లో బ‌లమైన నాయ‌కులు. పార్టీకి అతీతంగా వీరికి అభిమానులు కూడా ఉన్నారు. క‌నుక వీరిని బ‌రిలోకి దింపితే  గెలుపు ఖాయం అని టీడీపీ ధీమాగా ఉంద‌ట‌! ఈ విజ‌య ప్ర‌భావం రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా భారీ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశమూ ఉంటుంది క‌దా! మ‌రి బాబు వ్యూహంతో వైసీపీకి షాక్ త‌ప్పేలా లేదు!!