ఏపీలో వైకాపా, టీడీపీ కేసుల ఫైట్!

ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైకాపాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత ముదురుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేద‌ని తాజా ప‌రిస్థితులను బ‌ట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజ‌ధాని నిర్మాణం స‌హా పోల‌వరం, ప‌ట్టిసీమల విష‌యంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక కేసులు కూడా న‌మోద‌య్యాయి. కొన్ని ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి.

మ‌రోప‌క్క‌, నేరుగా సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన మంగ‌ళ‌గిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. బాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు విచార‌ణ‌పై హైకోర్టులో ప్ర‌శ్నించారు. బాబుపై విచార‌ణ సాగ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీంతో బాబుపై విచార‌ణ‌కు ఆదేశిస్తూ.. సింగిల్ జ‌డ్జి గ‌తంలోనే తీర్పు చెప్పారు. అయితే, దీనిని స‌వాలు చేసిన బాబు.. ఈ విష‌యంలో కోర్టు లో విజ‌యం సాధించారు. అయినా కూడా ఆళ్ల బాబు ను విడిచి పెట్టేదిలేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే సుప్రీంలో కేసు దాఖ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌య‌మే టీడీపీ నేతల‌కు మండేలా చేసింది. దీంతో వాళ్లు కూడా వైకాపా అధినేత టార్గెట్‌గా కేసుల ముడి విప్పుతున్నారు. జ‌గ‌న్‌పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయ‌ని, వీటిని త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి జ‌గ‌న్ జైలుకు పంపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాళ్లు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని అనుకూల ప్ర‌భుత్వం బీజేపీ నేత‌ల‌తో మాట్లాడాల‌ని లేదా నేరుగా సుప్రీంలోనే కేసు విచార‌ణపై పిల్ వేయించాల‌ని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలిసింది. ఇదే జ‌రిగితే.. ఇరు ప‌క్షాల మ‌ధ్య కేస‌లు ఫైట్ ర‌స‌కందాయంలో ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.